No Headline
పత్తిని టిక్కీలలోకి
మారుస్తున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో 54,640 ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఇది సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువే. అయినా రైతులకు గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. జిల్లాలో మొత్తం 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, మేడికొండూరు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో ఇవి ఉన్నాయి.
నిబంధనల పేరు చెప్పి...
పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.7,521గా ప్రకటించారు. సీసీఐ దానికి కొన్ని షరతులు జోడించింది. తేమ 12 శాతంలోపు, పింజ పొడవు 29.5 – 30.5 మి.మీ., మైక్రోనీర్ విలువ 3.6 – 4.3 మధ్య ఉంటేనే మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. తేమ శాతం, పింజ పొడవు ఏ మాత్రం అటు ఇటు అయినా ధరలో కోత వేసేస్తున్నారు. అన్ని బాగున్నా ఏదో ఒక సాకు పెట్టి రూ.7 వేలకు మించి ఇవ్వడం లేదు. ఇక తేమ 12 శాతం దాటితే కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు. మిల్లుకు తీసుకెళ్లినా విక్రయించలేని పరిస్థితిలో దళారులు, ప్రయివేటు వ్యాపారులు రంగం ప్రవేశం చేస్తున్నారు. వారు అడిగిన ధరకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ. 5 వేల – రూ. 6 వేలలోపే చెల్లిస్తున్నారు.
ఈ ఏడాది పత్తి నాణ్యమైన దిగుబడి వచ్చినా అందుబాటులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. పత్తి నిల్వ చేసుకుంటే రంగు మారి ధరలు మరింత తక్కువ ధర వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. నవంబర్ నెల చివర కావడంతో మంచు కురుస్తోంది. దీనివల్ల పత్తిలో తేమశాతం పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
మరిన్ని ఆటంకాలు
రైతులు తమ పంటను ఈ – క్రాప్ బుకింగ్, ఈ – పంట నమోదు ప్రక్రియ చేయడంతోపాటు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం అందజేయాలి. అమ్మకాల కోసం రైతులు, కౌలు రైతులు తప్పనిసరిగా రావాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. ఇవన్నీ రైతులకు ఇబ్బందికరంగా మారాయి. కొనుగోలు కేంద్రాలను మార్కెట్ యార్డులో కాకుండా మారుమూల ఉన్న మిల్లుల వద్ద ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వ్యవసాయ పనులు మానుకొని పంట విక్రయించేందుకు రైతులు రెండు రోజులు వెచ్చించాల్సి వస్తోంది. నిబంధనల పేరుతో మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలామంది గ్రామాల్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు బయ్యర్లు వచ్చి కొనుగోలు చేసేవారు. ఒకరోజు పంటను కొనుగోలు చేయలేకపోయినా మరునాడు వెసులుబాటు ఉండేది. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్లి పత్తి విక్రయించడం ఇబ్బందికరంగా మారింది. అక్కడ వసతులు లేక రాత్రిళ్లు బస చేయాలన్నా, పంటకు కాపలా కాయాలన్నా రైతులకు కుదిరే పని కాదు. గతంలో సీసీఐ కొనుగోళ్లకు వచ్చే రైతులకు మార్కెట్ యార్డులో తాగునీరు, రెస్ట్ తీసుకునేందుకు బస వసతి ఏర్పాటు చేసేది. పత్తి మిల్లుల్లో ఆ పరిస్థితి లేదు. కనీసం పట్టించుకునే నాథుడు లేడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
తాడికొండ మండలంలోని పత్తి రైతులకు ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెంలోని జిన్నింగ్ మిల్లును కొనుగోలు కేంద్రంగా నిర్ణయించారు. ఇక్కడికి తీసుకువెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంది. క్వింటాలుకు రూ. 400 – రూ. 500 అద్దె చెల్లించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment