సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడా చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌లే కనిపిస్తున్నాయి.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పని జరగడం లేదు. ఈ ప్రభుత్వంలో దోచుకోవడం.. పంచుకోవడమే.’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. కొత్త మద్యం బ్రాండ్‌లు తెచ్చి దండుకుంటున్నారు.. క్వాలిటీ తగ్గించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. స్కామ్‌ల కోసం ఈరోజు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు అమ్మేయడం సంపద సృష్టా? సంపద సృష్టిస్తానని.. కరెంట్ బిల్లులు బాదుడే బాదుడు. కరెంటు బిల్లులు బాదుడే రూ.18 వేల కోట్లు. ట్రూ అఫ్‌ఛార్జీల పేరుతో చంద్రబాబు బాదుడే బాదుడు. సంపద సృష్టి పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.
రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రోడ్ల నిర్మాణం కోసం 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. పోర్టులు నిర్మిస్తేనే రాష్ట్రానికి సంపద సృష్టి అవుతుంది. గ్రామీణ రోడ్లపై టోల్ వసూలు చేయడం సంపద సృష్టి అవుతుందా?. అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పిచంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అసైన్డ్ భూములపై అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా తప్పుడు ప్రచారం చేశారు. దళితుల వద్ద నుంచి పెత్తందారులు అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
2.06 లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22ఏలో పెట్టారు. 98 వేల రైతులను నిషేధిత జాబితాలో పెట్టారు. మా హయాంలో 15 లక్షల మంది పేదలకు మంచి చేశాం. అసైన్డ్ భూములపై పేదలకు సర్వహక్కులు కల్పించాం. మరో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాం. 1.07 లక్షల మంది రైతుల సమస్య పరిష్కరించాం. బాబు హయాంలో పేదలకు సెంటు స్థలం ఇచ్చారా?. మా హయాంలో 30.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. 9 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. 17 వేల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాం. ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోజు ఇళ్ల నిర్మాణాలనే ఆపేశారు. పేదలంతా చంద్రబాబును తిట్టుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment