ఆరబెట్టిన ధాన్యానికి మద్దతు ధర
కొల్లిపర: రైతులు దళారులను ఆశ్రయించకుండా వరి ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మండలంలోని వల్లభాపురం, మున్నంగి గ్రామాల్లో రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల వద్దకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజతో కలసి మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. మనోహర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే సమయంలో 17శాతం నుంచి 23శాతం వరకు తేమ ఉన్నా ఫర్వాలేదని వివరించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిందని, సాధారణ రకం క్వింటాకు రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, 75 కేజీలు సాధారణ రకానికి రూ.1,725, గ్రేడ్ ఏ రకానికి రూ.1,740 చెల్లిస్తామని పేర్కొన్నారు. అమ్మిన 24 గంటలలో నగదు రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తామని పేర్కొన్నారు. కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేసినా, ఇబ్బందులు పెట్టినా వెంటనే రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1967, లేదా జిల్లా కంట్రోల్ రూం 7702806804కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం లక్ష్మి, తెనాలి ఏడీఏ ఉషారాణి, తహసీల్దార్ జి.సిద్ధార్థ, డీఈఎంసీ, వీఓఏఎస్‌లు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్
Comments
Please login to add a commentAdd a comment