పంట కుంటలతో మేలు
బీకేపాలెం(కాకుమాను): వర్షపు నీటిని పంట కుంటల్లో నిల్వ చేసుకుంటే వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీటి సరఫరా లేనప్పుడు పంటలను పండించుకోవచ్చని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. మండలంలోని బీకేపాలెం గ్రామంలో బుధవారం గ్రామానికి చెందిన రైతు పంగులూరి శ్రీనివాసరావు పొలంలో పంట కుంటకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పొలాల్లో పంట కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంట కుంటల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి రూ.57 వేలు మంజూరయ్యాయని, ఆ నిధులతో ప్రస్తుతం మండలంలో రెండు కుంటలను నిర్మిస్తున్నట్టు చెప్పారు.
సీసీ రోడ్డు నిర్మాణం పరిశీలన
మండలంలోని కొల్లిమర్లలో రూ.9 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ కృష్ణా నీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం పాండ్రపాడులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పౌష్టికాహారం పంపిణీపై ఆరా తీశారు. కేంద్రంలోని చిన్నారుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. తర్వాత స్థానిక బాలయోగి గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, జిల్లా పరిషత్ నిధులతో త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముజావర్ షేక్ గుల్జార్ బేగం,తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో యుగకీర్తి, ఎంఈవోలు కె.ఎఫ్.కెనడీ, విజయ్ భాస్కర్, ఏవో కిరణ్మయి ఉన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో రక్షణ కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి బీకేపాలెంలో పంట కుంటకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment