అవయవ దానంతో పునర్జన్మ
గుంటూరు మెడికల్: అవయవదానంతో మనిషి మరణించినా ఎనిమిది మందికి జీవితాన్ని ప్రసాదించి, వారిలో జీవించవచ్చని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు చైర్‌పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి చెప్పారు. గురువారం గుంటూరు జీజీహెచ్‌లో అవయవదానంపై అవగాహన కోసం రూపొందిచిన పోస్టర్‌ను ఆమె గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యశస్వి రమణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా దేశంలో అవయవదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ ట్రస్టు పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం కిడ్నీ, లివర్ దానం చేసేందుకు ముందుకు వస్తున్న లైవ్ డోనర్లకు ప్రోత్సాహకంగా రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అవయవ స్వీకర్తలకు రూ. 15 వేలు ప్రభుత్వం ఇస్తోందని, దాతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. లైవ్ డోనర్స్ అయిన తమ ఉద్యోగులకు కేంద్రం 42 రోజుల స్పెషల్ లీవ్ ఇస్తూ జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. రైల్వే శాఖలో ఈ జీవో ఇచ్చిందని, దీని ద్వారా దాతలు విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు హాజరు కావొచ్చని అన్నారు. ఇదే తరహా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు. అవయవ దానంపై పని చేసేందుకు 2013లో జీవన్‌దా్‌న్ ట్రస్టు ప్రత్యేకంగా ఏర్పడినట్లు తెలిపారు. ఈ ట్రస్టులో 978 మంది అవయవ దాతలు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా అనేక మందికి నూతన జీవితాలను ప్రసాదించారన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో అవయవ దానంపై ట్రస్టు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణలో 58 వేల మంది తమ శరీర దానానికి ముందుకు వచ్చి తమకు అనుమతి పత్రాలు అందజేశారన్నారు.
డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ.. కేంద్రం పరిధిలోని వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆర్గాన్ డోనర్ కార్డు వస్తుందన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా సంఘం ఐదో మహాసభను గుంటూరులో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 3న గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో జరిగే ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.సత్యకుమార్, విశిష్ట అతిథిగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు విచ్చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్‌లో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించిన ప్రముఖ నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేకు సావిత్రిబాయి పూలే జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వివరించారు.
బాడీ డొనేషన్‌కు ముందుకొచ్చిన 58 వేల మంది 3న అవయవ దానంపై గుంటూరులో మహాసభ అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు సీతామహాలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment