రాజ్యాంగ రక్షణకు పోరాటాలే శరణ్యం
సీపీఐ శత వార్షికోత్సవ సభలో రామకృష్ణ
లక్ష్మీపురం: రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పోరాటాలకు మళ్లీ సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమ సమాజ స్థాపనకు ఉద్యమించడంతోపాటు త్యాగాలకూ సిద్ధంగా ఉండాలన్నారు. గాంధీ పార్క్ వద్ద గురువారం సీపీఐ శత వార్షికోత్సవ బహిరంగ సభ పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. ముందుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. దారి పొడువునా నృత్యాలు, కోలాటం ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సమరయోధులు అంటే గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను సైతం అవమానిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. మతాల పేరుతో ప్రజల మధ్య చీలికలు తెచ్చి లబ్ధి పొందుతోందని దుయ్యబట్టారు. దేశంలో సోషలిస్టు సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. భూ సంస్కరణల చట్టం తీసుకురావడంలో సీపీఐ పోరాటాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్ర దేశంలో జరుగుతోందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో నేడు పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే సవాళ్లను మరింత దీటుగా ఎదుర్కోవటానికి ఈ వార్షికోత్సవాలు వేదిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. సభలో నగర నాయకులు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment