సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలి
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
నరసరావుపేట: గతేడాది డిసెంబర్ 26 నుంచి 17 రోజులపాటు చేసిన సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం వెంటనే జీఓలు ఇచ్చి అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటియు) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి మేనేజర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిలార్ మసూద్ మాట్లాడుతూ సమ్మె కాలంలో ఒప్పందాలు చేసుకొని ఏడాది గడుస్తున్నా వాటిని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కార్మికులు యోహాను, జీవరత్నం, చిన్న అల్లాబక్షు, సోమశేఖర్, నాగయ్య, జి.రమణ పాల్గొన్నారు.
విద్యుత్ సామగ్రి చోరీ కేసులో నిందితుల అరెస్టు
కంకిపాడు: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాలు, విల్లాలు, సోలార్ ప్లాంట్లు లక్ష్యంగా రాగి వైర్లు, ఎలక్ట్రికల్ తీగలు, ఇత్తడి ప్లంబింగ్ సామగ్రి చోరీ చేసిన ముఠాను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక పీఎస్‌లో గురువారం గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి గ్రామం గండాలయపేటకు చెందిన మేకల గోపి, తుమ్మ యెర్రకాటయ్య, మేకల జానీ, కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన పొట్లూరి మల్లేశ్వరరావు విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. బంధువులైన వీరు, మరో నలుగురు వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. విజయవాడ–మచిలీపట్నం హైవేకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు, విల్లాలు, సోలార్ ప్లాంట్లు వద్ద సామగ్రిని చోరీ చేయటం మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణా జిల్లా కంకిపాడులో మూడు, పెనమలూరు – ఒకటి, పామర్రు– రెండు, మచిలీపట్నం–1 స్టేషన్‌ల పరిధిలో ఈ చోరీ కేసులు నమోదయ్యాయి. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో ఈడుపుగల్లు పరిధిలోని చైతన్య విద్యాసంస్థల సమీపంలోని ఖాళీ ప్లాట్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి, గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాస్తవలు తెలిశాయి. వారి నుంచి రూ.11 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మేకల గోపి, తుమ్మ యెర్ర కాటయ్య, పొట్లూరి మల్లేశ్వరరావు, మేకల జానీలను అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్ బృందానికి రివార్డులు అందించి, అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment