సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
అక్రమ కేసులు పెడుతున్నారంటూ వ్యక్తి ఆవేదన
ప్రత్తిపాడు: చర్చి స్థలం ఆక్రమించి నిర్మిస్తున్న గోకులం షెడ్డు నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నందుకు కొందరు గ్రామస్తులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగు మందు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెబుతూ, పురుగు మందును తాగుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ ఘటన ప్రత్తిపాడు మండలంలో జరిగింది.. సెల్ఫీ వీడియోలో బాధితుడు చెప్పిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం కొండేపాడుకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలో గోకులం షెడ్డును నిర్మించుకుంటున్నాడు. ఆ స్థలంలో కొంత తన తాతలు దానంగా ఇచ్చిన చర్చి స్థలం ఉందని, గోకులం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన దాసరి కల్యాణ్ కొద్ది రోజులుగా గ్రామ, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు సమస్యను పరిష్కరించడం లేదు. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దాసరి కల్యాణ్‌ను దుర్భాషలాడాడు. కల్యాణ్‌తోపాటు అతని బంధువులపై అక్రమ కేసులు పెట్టారు. పోలీసులు ఆ కేసులు పట్టుకుని తనను వేధిస్తున్నారని, చర్చి స్థలం కోసం పోరాడుతున్న తనకు జరిగిన అవమానం భరించలేక పురుగుమందు తాగి చనిపోతున్నట్టు వీడియోలో వివరించాడు. అనంతరం పురుగుమందు తాగేశాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment