గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీగా భానోదయ బాధ్యతల స్వీకరణ
గుంటూరు రూరల్: గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీగా జి.భానోదయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. అసాంఘిక శక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భానోదయ 2022 బ్యాచ్‌లో నియమితులయ్యారు. రాజమండ్రి ఈస్ట్ జోన్‌లో ప్రొబేషనరీ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి గుంటూరు సౌత్ జోన్‌కు బదిలీపై వచ్చారు.
ముగ్గురిపై కత్తితో దాడి
చిట్టీల వివాదమే కారణం!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చిట్టీ వివాదం నేపథ్యంలో ముగ్గురిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. నగరంపాలెం పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన చల్లగొల్ల రమేష్ అదే ప్రాంతానికి చెందిన సింగయ్య ద్వారా రూ.లక్ష చిట్టీ వేశాడు. మూడు నెలలుగా రమేష్ డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు సింగయ్యకు ఫోన్ చేసి రమేష్ డబ్బులు చెల్లించలేదని, మధ్యవర్తిగా ఉన్న నువ్వు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహంతో సింగయ్య రమేష్‌కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో తిట్టాడు. రమేష్ సోమవారం తన కుమారుడు యశ్వంత్, బావమరిది నాయుడును తీసుకుని సింగయ్య ఇంటికి వెళ్లి చిట్టీ డబ్బులు చెల్లించాడు. డబ్బు కట్టడంలో కొంత ఆలస్యమైనంతమాత్రాన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం సరికాదని చెప్పారు. ఈ నేపథ్యంలో సింగయ్యకు, రమేష్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో సింగయ్య కుమారుడు మల్లికార్జునరావు ఇంట్లో ఉన్న కత్తితో రమేష్ కుమారుడు యశ్వంత్, నాయుడులపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రమేష్ తలపై దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సింగయ్య, మల్లికార్జునరావులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన రమేష్, యశ్వంత్, నాయుడులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. పోలీసులు ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment