తెనాలి: సామర్థ్యానికి మించి జనం ఎక్కడంతో అపార్టుమెంటు లిఫ్ట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం వెనుకవైపు వీధిలో అయ్యప్పస్వామి గుడి వద్ద గ్రీన్‌లీఫ్ మినర్వా అపార్టుమెంటులో 32 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. సమీపంలోని కఠెవరం గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఐదో ఫ్లోరులోని ఒక ఫ్లాటులో నివసిస్తున్న కుటుంబం సోమవారం రాత్రి పురోహితులను పిలిపించి, తమ ఇంట్లో రుద్రపారాయణం చేయించారు. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయి, రాత్రి 10 గంటల ప్రాంతంలో పురోహితులు, వారి సహచరులు అంతా కలిసి కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 11 మంది లిఫ్ట్‌లో ఎక్కారు. ఐదు నుంచి నాలుగు, మూడో ఫ్లోరు వరకు బాగానే వచ్చిన లిఫ్ట్, అక్కణ్ణుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. కింద ఉండే స్ప్రింగులపై పడి పైకిలేచి మళ్లీ పడిపోయిందని అక్కడ నివసిస్తున్నవారు తెలిపారు. దీంతో లిఫ్టులోని వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. అందులో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ వాహనంలో వీరిని స్థానికంగా గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వాస్తవానికి లిఫ్ట్ సామర్థ్యం ఆరుగురేనని చెబుతున్నారు. దాదాపు రెట్టింపు జనాభా ఎక్కడంతో లిఫ్టుకుండే వైరు తెగి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. దీనిపై బాధితులను వివరాల కోసం సంప్రదించగా, పత్రికలో రాయొద్దని కోరారు.
ఐదుగురికి తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment