చిరునవ్వులు చెలరేగు
ప్రత్తిపాడు: ధర లేక పత్తి పంట తెల్లబోతోంది. ఆశించిన స్థాయి దిగుబడి లేక మిర్చి ఘాటు తగ్గింది. వరిని తెగుళ్ళు వెక్కిరిస్తున్నాయి. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసే ప్రధాన పంటలు తెగుళ్లు, పురుగుల బారిన పడి పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు నేల వైపు బేల చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేగు సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. నష్టాల మాట లేకుండా రైతుకు కాసులు కురిపిస్తోంది. ధర కూడా బాగుండటం రైతులకు కలిసొస్తోంది. రేగు పంటకు ప్రత్తిపాడు మండలం ప్రసిద్ధి. రావిపాటివారిపాలెం, చినకోండ్రుపాడు, నడింపాలెం గ్రామాల్లో పలువురు రైతులు సుమారు డైబ్బె ఎకరాల్లో నాటు రకం రేగు తోటలను సాగు చేస్తున్నారు. ఏటా నవంబరులో పూత మొదలై డిసెంబరులో కాపు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు రేగు దిగుబడులు విస్తారంగా వస్తాయి. ఈ ఏడాది వరుసగా రెండు తుఫా న్‌లు రావడంతో పూత, పిందె రాలి దిగుబడులు కొంత తగ్గినా పరిస్థితి మెరుగ్గానే ఉంది.
పెరుగుతున్న రేగు సాగు
దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధర కూడా లాభాల బాటలో ఉండటంతో రైతులు రేగు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆరేడేళ్ల కిందట వరకు పాతిక, 30 ఎకరాల్లో మాత్రమే ఉన్న రేగు సాగు ఈ ఏడాది సుమారు 70 ఎకరాలకు పెరిగింది. డబ్బులు కళ్లపడడంతో ఈ సాగుపై రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే..
రేగు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే పండ్లను ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పచ్చి రేగుపండ్ల స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో రైతులు మార్కెటింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యానశాఖ రాయితీలూ అందడం లేదు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసుకుంటామని రైతులు చెబుతున్నారు.
ప్రత్తిపాడు మండలంలో సాగులో ఉన్న రేగు పండ్ల తోటలన్నీ నాటు రకమే. నాటు రకాల్లో తీపి, పులుపు ఉన్నా, ఈ ప్రాంతంలో సాగులో ఉన్నది మాత్రం తీపి కాయలే. జిల్లా మొత్తమ్మీద తీపి నాటు కాయను పండించేది ఇక్కడే అంటే అతిశయోక్తి కాదు. కొండలకు సమీపంలో ఉండటంతో ఈ భూములు రేగు పంటకు కలిసొస్తున్నాయి. కాయలు రుచికరంగా ఉంటున్నాయి. దీంతో వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే రేగు పండ్లను క్వింటాళ్లు, పెద్ద మానికల లెక్కన కొనుగోలు చేసుకుని తీసుకెళ్లి గిద్దలు, చిన్నమానికల లెక్కన గ్రామాల్లో విక్రయించుకుంటుంటారు. సాధారణ జనమైతే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశవిదేశాల్లో ఉంటున్న బంధువులకు, హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటకల్లో ఉంటున్న వారికి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన కాయలను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. తోటల యజమానులతో పరిచయస్తులైతే ఏటా ఒకే తీపి చెట్టును ఎంచుకుని ఆ చెట్టు కాయలను తెల్లవారుజామున కోయించుకుని మరీ బంధుమిత్రులకు పంపుతుంటారు. ఆ చెట్లకున్న పచ్చి కాయలూ పంచదారలా ఉండడం విశేషం.
ఆశాజనకంగా రేగు సాగు
ప్రత్తిపాడు నాటు కాయలకు గిరాకీ ఎకరాకు రెండు వేల మానికలకుపైగా దిగుబడి మానిక రేగు పళ్లు రూ.70 నుంచి రూ. 200పైమాటే ఉద్యాన పంటకు ప్రభుత్వ ప్రోత్సాహం నాస్తి
ఎకరాకు రెండు వేల నుంచి మూడు వేల మానికలు..
రేగు పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరాకు రెండు వేల నుంచి మూడు వేల మానికల వరకు దిగుబడి వస్తోంది. వాతావరణం అనుకూలిస్తే నాలుగు వేల మానికలపైన కూడా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో మానిక ధర రిటైల్‌గా రూ.200 వరకు ధర పలుకుతుంది. హోల్‌సేల్‌గా వ్యాపారులకైతే రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తారు. అంటే సగటున ఎకరాకు లక్షన్నర నుంచి రూ.మూడు లక్షల వరకు రాబడి వస్తుందన్న మాట. ఇందులో ఖర్చులు, పెట్టుబడులు, కౌలుకు రూ.లక్ష పైనే ఖర్చు అవుతుంది. దీంతో పంట కాలం రెండు, మూడు నెలల సమయంలో ఖర్చులన్నీ పోను సుమారు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. సీజన్‌లో సగటున రోజుకు క్వింటాకు పైగా దిగుబడి వస్తుంది.
ఈ తీపి నాటు కాయ సాగు ప్రత్యేకం..
Comments
Please login to add a commentAdd a comment