ఓవైపు ఆశించిన దిగుబడి లేక, మరోవైపు మార్కెట్‌లో ధరలేక రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటా మిర్చికి ధరలు పలకగా.. ప్రస్తుతం రూ.15 వేలు మించి పలకడంలేదు. గత ఏడాది తేజ, బాడిగ రకాలు క్వింటాలుకు రూ.21వేల నుంచి రూ.27వేల వరకు ధర లభించింది. దీంతో రైతులు ఉత్సాహంగా ఈ రకాలను సాగుచేశారు. ఎకరా మిరప సాగుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కానీ, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెగుళ్లతో పంట ఎదుగుదల లేక దిగుబడి సగానికి పడిపోయింది. ఫలితంగా తేజ, బాడిగ, నంబర్–5, 334, 341 రకాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఈ ధరతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. కనీసం రూ.20 వేలు పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఇదిలా ఉంటే.. మిర్చి పౌడర్ కంపెనీల వద్ద ఇప్పటికే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని మిర్చి వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు బంగ్లాదేశ్, బర్మా, వంటి దేశాల్లోనూ అత్యధికంగా పంట సాగుచేయడం కూడా ధరలు పతనానికి మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పైగా కోల్డ్‌స్టోరేజీల్లో అధికంగా నిల్వ ఉండటం కూడా మరో కారణమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment