ప్రతి రైతుకు యూనిక్ ఐడీ నంబరు
కొరిటెపాడు(గుంటూరు) : ప్రతి రైతుకు గుర్తింపు నెంబరు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ తరహాలో రైతులకు యూనిక్ ఐడీ నెంబరు ఇచ్చేందుకు జిల్లాలో ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ(ఏపీఎఫ్ఆర్) పేరుతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీఎఫ్ఆర్ పోర్టల్‌లో మండల వ్యవసాయ అధికారి, రైతు సేవా కేంద్రాల ఇన్చార్జిలు మ్యాపింగ్ చేస్తున్నారు. జిల్లాలో ఫిరంగిపురం మండలంలో ఐదు గ్రామాలు, మేడికొండూరు మండలంలో రెండు గ్రామాల్లో ఫైలట్ ప్రాజెక్టు కింద మ్యాపింగ్ చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అక్కడ విజయవంతం అయితే జిల్లాలోని మిగిలిన 16 మండలాల్లో మ్యాపింగ్ చేసి రైతులకు యూనిక్ ఐడీ నెంబర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు రైతులకు ప్రత్యేక గుర్తింపు అనేది లేదు. వెబ్‌ల్యాండ్ డేటానే అందరికీ ప్రామాణికం అయింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు యూనిక్ ఐడీ నెంబర్లే ప్రామాణికం అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment