![ఎమ్మె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/06022025-g_gnt_tab-01_subgroupimage_1885646016_mr-1738786072-0.jpg.webp?itok=iu3tlzGD)
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. నామినేషన్లు 10వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. 8, 9 తేదీలలో సెలవులని చెప్పారు. మంగళవారం ఒక్క అభ్యర్థి నామినేషన్ వేశారన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పారు. ఈ నియోజకవర్గం పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు పూర్తిగా... ఏలూరు, బాపట్ల జిల్లాలలో కొంత భాగం ఉందన్నారు. జనవరి 30వ తేదీ నాటికి పురుషులు 2,06,176, మహిళలు 1,40,307, ట్రాన్స్‌జెండర్స్ 46 మంది కలిపి మొత్తం ఓటర్లు 3,46,529 మంది ఉన్నారన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. 416 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 67 యాగ్జిలరీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణకు గుంటూరు జిల్లాలో 23 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఉన్నాయని చెప్పారు. సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురు అధికారులతో పాటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. బ్యాలెట్ పేపరుతో మొదటి ప్రాధాన్యత ఓటు విధానంలో జరుగుతున్నందున చెల్లుబాటు అయ్యేలా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తామన్నారు.
మిర్చి రికార్డు
యార్డులో 1,27,321 బస్తాలు విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం భారీ స్థాయిలో ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యధికంగా 1,21,569 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,321 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.15,500 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.9,500 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.11,000 నుంచి రూ.14,700 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 72,162 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
లక్ష్మీనృసింహస్వామికి వెండి పళ్లెం కానుక
మంగళగిరి: నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారికి దాతలు వెండి పళ్లెం కానుకగా సమర్పించారు. బుధవారం ఆలయ ఆవరణలో ఈవో కార్యాలయంలో ఆద్య బిల్డర్స్ అధిదినేత చిరుమామిళ్ళ చంద్రశేఖర్ రూ.1.40 లక్షల విలువైన 1 కేజీ 35 గ్రాముల వెండి, 2 గ్రాముల బంగారంతో కూడిన పళ్లెం ను ఈవో ఎ. రామకోటిరెడ్డికి అందజేశారు. దాతలును ఈవో అభినందించారు. స్వామి వారి వస్త్రాలతో సత్కరించారు.
సజావుగా ఒకేషనల్ ప్రాక్టికల్స్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఏడు కేంద్రాల పరిధిలో 1,111 మంది విద్యార్థులకు 1,034 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 578 మందికిగాను 528, మధ్యాహ్నం 533 మందికిగాను 506 మంది హాజరైనట్లు ఆర్‌ఐవో జీకే జుబేర్ తెలిపారు.
![ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05gwe203-150102_mr-1738786073-1.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
![ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు 2](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05mgl03-150197_mr-1738786073-2.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు
Comments
Please login to add a commentAdd a comment