విద్యార్థికి రూ. వెయ్యి..!
విద్యార్థుల నుంచి రూ.వేల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ప్రాక్టికల్స్ నిర్వహణ భారాన్ని సైతం వారిపైనే మోపుతున్నాయి. ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో ఫీజుల రూపంలో రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్స్‌కు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే హాల్ టిక్కెట్లు ఇవ్వబోమంటూ వేధిస్తున్నాయి.
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు బుధవారం ప్రాక్టికల్స్ ప్రారంభం అయ్యాయి. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఈ నెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. విద్యార్థులకు చదువుతున్న కళాశాలలో పరీక్షలు జరుగుతాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 119 కళాశాలల్లో జరగనున్నాయి. వాటిలో నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు. మిగిలినవి ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు. 26,308 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దాదాపు 90 శాతం మంది కార్పొరేట్ కళాశాలల వారే. ఏడాది పొడవునా తరగతిగదిలో థియరీతోపాటు ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్ చేయించేందుకు కలిపి యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రాక్టికల్స్ తూతూ మంత్రంగా చేయించి చేతులు దులుపుకొన్నాయి. బోర్డు పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇచ్చాక జనవరిలో ల్యాబ్‌లకు పంపి ప్రాక్టికల్స్ చేయిస్తుండటం ఏటా జరిగే తంతు. థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు పరీక్ష ఫీజుగా బోర్డుకు రూ.875 వంతున విద్యార్థులు చెల్లించారు. వాస్తవానికి ప్రాక్టికల్స్ నిర్వహణకు ప్రతి కళాశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.ఐదు వేల వరకు బోర్డే చెల్లిస్తోంది.
కొరవడిన ప్రభుత్వ నియంత్రణ
ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిన ఫలితంగా రూ.వేలల్లో ఫీజులు, పుస్తకాలకు రూ.12 వేలు, యాప్ పేరుతో మరొక రూ.3 వేలు వంతున ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ప్రాక్టికల్స్ పేరుతో ప్రతి క్యాంపస్ నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నాయి. శాఖాపరమైన చర్యలు, జరిమానాల విధింపు లేక యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
‘కార్పొరేట్’ కళాశాలల కక్కుర్తి
విద్యార్థులపైనే ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ భారం ల్యాబ్ మెయింటినెన్స్ అంటూ రూ.వెయ్యి వంతున డిమాండ్ చెల్లించకుంటే హాల్ టిక్కెట్లు ఇవ్వబోమని బెదిరింపులు పబ్లిక్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్ ఫీజు కూడా చెల్లించిన విద్యార్థులు
ప్రాక్టికల్స్ పేరుతో వసూళ్లకు వీల్లేదు
ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి నగదు వసూలు తగదు. ల్యాబ్ మెయింట్‌నెన్స్ పేరుతో అనధికారికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఇంటర్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్న కళాశాలల ప్రిన్సిపల్స్‌పై చర్యలు చేపడతాం.
– జీకే జుబేర్, ఆర్‌ఐవో, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment