ఒకే క్రీడ.. రెండు సంఘాలు
వరంగల్ స్పోర్ట్స్: పతకాలే లక్ష్యంగా మైదానాల్లో కుస్తీ పడుతున్న క్రీడాకారులకు కొన్ని క్రీడా సంఘాల తీరు పెనుసవాల్‌గా మారుతోంది. సాధారణంగా ఒక క్రీడకు ఒకే సంఘం ఉంటుంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక క్రీడకు రెండేసి సంఘాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా క్రీడాకారుల భవిష్యత్‌పై అయోమయం నెలకొంటోంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 04ను అత్యధిక క్రీడా సంఘాలు తమకేమీ వర్తించవు అన్నట్లు సంపాదన వేటలో పడగా, మరికొన్ని క్రీడలకు ఒక్కొ క్రీడ (తైక్వాండో, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, ఉషూ, బేస్ బాల్, టెన్నిస్ తదితర క్రీడలు)కు రెండేసి సంఘాలు చెలామణి అవుతున్నాయి. దీంతో ఏది అసలు, ఏదీ నకిలీ సంఘమేదో అర్థం కానీ దుస్థితి నెలకొంది. జీఓ 04ను పకడ్బందీగా అమలు చేసి నకిలీ క్రీడా సంఘాలకు కళ్లెం వేయాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ నిర్లక్ష్యం క్రీడాకారుల భవితవ్యంపై తీరని ప్రభావం చూపెడుతోంది.
5 నుంచి 7 క్రీడా సంఘాలు
మాత్రమే నివేదిక అందజేత
2016–17 సంవత్సరంలో అప్పటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్) వైస్ చైర్మన్, ఎండీ దినకర్ బాబు జీఓ 04 నిబంధనల ప్రకారం కొనసాగుతున్న క్రీడా సంఘాల వివరాలు పంపాలని అన్ని జిల్లాల డీవైఎస్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 5 నుంచి 7 క్రీడా సంఘాలు మాత్రమే డీఎస్‌ఏ( డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ)కు నివేదిక అందించినట్లు తెలుస్తోంది.
తప్పనిసరిగా బైలాను అనుసరించాలి..
జీఓ 04 ప్రకారం క్రీడా సంఘాలు తప్పనిసరిగా బైలాను అనుసరించడంతో పాటు బ్యాంకు ఖాతా, లావాదేవీల పారదర్శకత, రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉండాలి. అంతేకాదు ఏటా జిల్లా, రాష్ట్ర పోటీలను నిర్వహించి జాతీయ స్థాయికి పంపే జట్టు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. ఈ నిబంధనలు ఎన్ని క్రీడా సంఘాలు పాటిస్తున్నాయో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సీనియర్ క్రీడాకారులు చెబుతున్నారు. జీఓ 04ను పాటించినప్పుడే ఆయా క్రీడా సంఘాలు నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల సర్టిఫికెట్లకు విలు వ ఉంటుంది. ఆ క్రీడాకారులు భవిష్యత్‌లో విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకు నే వెసులుబాటు ఉంటుంది. లేనిపక్షంలో జాతీయ స్థాయిలో రాణించినప్పటికీ ఫలితం ఉండదని పలువురు సీనియర్ క్రీడాకారులు చెబుతున్నారు.
క్రీడాప్రాధికార సంస్థ నిర్లక్ష్యం..
క్రీడాకారులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన క్రీడాప్రాధికార సంస్థ నిర్లక్ష్యం.. ఒలింపిక్స్ సంఘం తీరుతెన్నులు కలగలిపి క్రీడాకారుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ క్రీడాకారులు , ఒలింపిక్స్ సంఘం పెద్దలతో సమావేశం నిర్వహించి ఒకటే క్రీడ.. ఒకటే అసోసియేషన్‌గా చక్కపెట్టాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఉన్నతస్థాయిలో చర్చించాల్సిన అంశం..
జీఓ 04 అమలు, ఒకటే క్రీడ.. రెండు సంఘాలు అనే వివాదం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యధిక శాతం క్రీడా సంఘాలలో నెలకొని ఉంది. ఇవి నా పరిధిలో తీసుకునే నిర్ణయాలు కాదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
–రవీందర్, డిప్యూటీ డైరెక్టర్, శాట్
క్రీడా సంఘాలకు పట్టని జీఓ 04
క్రీడాకారుల భవిష్యత్‌తో ఆటలు
ఏ సంఘం సర్టిఫికెట్ చెల్లుబాటు?
పట్టించుకోని క్రీడా ప్రాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment