నామమాత్రంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్: సాధారణ ఎన్నికలకు ముందు ఉరుకులు పరుగులతో చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రంగానే మిగిలిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నిట్ సమీపంలోని దర్గా వందఫీట్ల రోడ్డు జంక్షన్ వద్ద ప్రభుత్వం సుమారు రూ.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు అలంకారప్రాయంగా మారాయి. అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించాలని లక్ష్యంగా స్థానిక నాయకులు, అధికారులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. అర్ధరాత్రి సీసీ రోడ్లు వేసి తవ్వకాలు చేపట్టి జంక్షన్‌లో ఒక ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. రూ.10 లక్షల ఖర్చుతో ఆ ఫౌంటేన్‌లో హైదరాబాద్ తరహాలో రాళ్ల మాదిరిగా ఏర్పాటు చేసి నీళ్లు చిమ్మే విధంగా మోటార్లు, లైట్లు అమర్చారు. అయితే, కొద్ది రోజులకే ఇక్కడ ఏర్పాటు చేసిన నీటి మోటార్లు, లైట్లు దొంగలు ఎత్తుకుపోయారు. ఏమైంది అన్నదానిపై ఇప్పటికీ అధికారులు నిగ్గు తేల్చలేదు సరి కదా.. అక్కడ కొత్తవి కూడా ఏర్పాటు చేయలేదు. ఇదిలా ఉంటే రోడ్డుకు ఇరువైపులా ఆగమేఘాలపై షాపులు ఖాళీ చేయించారు. వీధి వ్యాపారులను తోసేసి సీసీ చేసిన అధికారులు తర్వాత మాత్రం మిగిలిన పనులు చేపట్టలేదు.
సీసీ రోడ్డు పక్కన షాపులు..
జంక్షన్ సమీపంలో ఓ మున్సిపల్ అధికారి బంధువుల షాపు ఉన్నందున విస్తరణ నామమాత్రంగా చేశారని, ఒకవేళ లెక్క ప్రకారం విస్తరణ చేస్తే ఆ షాపునకు కూడా ఇబ్బంది అవుతుందని వదిలేశారని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు అధికారులు నిర్మించిన సీసీ రోడ్డు పక్కన షాపులు ఒక్కొక్కటిగా వెలిశాయి. దీంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది. అయినా అధికారులు ఈ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.
డ్రెయినేజీ లేక..
నిట్ మెయిన్ రోడ్డు నుంచి దర్గా రోడ్డుకు అధికారులు ఐదు ఫీట్ల డ్రెయినేజీ నిర్మించారు. ప్రధాన రోడ్డు నుంచి ప్రారంభంలో సుమారు 15 మీటర్ల వరకు వదిలేశారు. ఇది ఎవరి లాభం కోసం వదిలేశారన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనివల్ల ప్రధాన రోడ్డులో ఉన్న నీరు ఎటు పోయేందుకు దారిలేక ఎప్పటికీ అక్కడే పారుతోంది. సంవత్సరానికోసారి షాపుల ఎదుట ఉన్న సీసీని పగులగొట్టి, అరుగులు కూల్చి జేసీబీలతో మురుగునీరు తరలిస్తున్నారు. దర్గా రోడ్డుకు కనెక్ట్ చేస్తే సమస్య తీరుతుందని పదేపదే చెప్పినా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డ్రెయినేజీ సమస్య పరిష్కరించాలని, రోడ్డు విస్తరణ చేయాలని, జంక్షన్ సుందరీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
పూర్తికాని దర్గా వంద ఫీట్ల రోడ్డు విస్తరణ, జంక్షన్ సుందరీకరణ
రహదారిపై చిరు వ్యాపారాలు..
తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య
ఫౌంటేన్‌లోని మోటార్లు, లైట్లను
అపహరించిన దొంగలు
Comments
Please login to add a commentAdd a comment