అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి
కేయూ క్యాంపస్ : వివిధ అంశాల్లో తమకు అన్యాయం జరిగితే గిరిజనులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ సెనేట్‌హాల్‌లో గిరిజన విద్యార్థుల, అసోసియేషన్స్, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ఉద్యోగి తనకు పదోన్నతుల్లో అన్యాయం జరిగితే జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఢిల్లీకి రావాల్సిన అవసరం లేకుండానే తాను ఉన్న ప్రాంతం నుంచే ఆన్‌లైన్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ వెబ్‌సైట్‌కు సమస్యను ఫిర్యాదు రూపంలో పంపితే అక్కడ రిజిస్టర్ అవుతుందన్నారు. ఎవరిమీద ఫిర్యాదు చేశారో వారికి నోటీసులు అవసరమైతే వారెంట్లు జారీచేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా కమిషన్ కృషి చేస్తుందన్నారు. కాకతీయ యూనివర్సిటీలోనూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ కబ్జాలు కూడా జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం పలువురు గిరిజన ఉద్యోగులు తమ సమస్యలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి విన్నవించారు. తనకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించడం లేదని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్ చీనా తెలిపారు. 2008లో కేయూలో ఇంగ్లిష్ విభాగంలో నియామకంగా కాగా తనకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించడం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపాజ్యోతి ఆవేదన వ్యక్తంచేశారు. యూజీసీ ఫెలోషిప్ ఉన్నా తనకు పీహెచ్‌డీ అడ్మిషన్ కల్పించలేదని ఇందిర వాపోయారు. తమకు హాస్టల్‌వసతి కల్పించాలని కేయూ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులు కోరారు. పీహెచ్‌డీ పరిశోధకులకు ఫెలోషిప్ వచ్చేలా చూడాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాంబాబు విన్నవించారు. హుస్సేన్‌నాయక్ స్పందిస్తూ ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కల్యాణ్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు, ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ రాజమణి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, తదితరులు పాల్గొన్నారు.
వీసీ, రిజిస్ట్రార్‌లతో సమావేశం
క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో బుధవారం సాయంత్రం వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ఆచార్య పి.మల్లారెడ్డి, ఇతర వివిధ పాలనాధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ సమావేశమయ్యారు. తన దృష్టికి వచ్చిన గిరిజన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించినట్లు సమాచారం. సమావేశంలో యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ బి.సురేశ్ లాల్, సీడీసీ డీన్ వి.రాంచంద్రం, డీన్‌లు హనుమమంతు, ప్రొఫెసర్ మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్ సీహెచ్.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో ముచ్చటించారు. యూనివర్సిటీ పరిధిలో నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించాలన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment