నకిలీ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
ఎంజీఎం: హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రైవేట్ ఆప్పత్రుల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీజీఎంసీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్హత లేని పలువురు వైద్యులుగా చెలామణీ అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు నిర్వహించారు. హనుమకొండలోని దీన్‌దయాళ్ నగర్‌లో నకిలీ వైద్యుడు బండి సదానందం, ధన్వంతరి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు మిట్టపల్లి సాంబమూర్తి, కాజీపేటలోని దేవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు కె.ప్రభాకర్ క్లినిక్‌ను తనిఖీ చేసి సదరు నకిలీ వైద్యులపై ఎన్‌ఎంసీ చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈసందర్భంగా వరంగల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ మియా మాట్లాడుతూ.. మెడికల్ షాప్ యజమానులెవరూ ఫార్మసిస్టులు లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యుల్(హెచ్) మందులు విక్రయించవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ వైద్యులకు అనుబంధంగా మెడికల్ షాప్ అనుమతికి సర్టిఫికెట్ ఇచ్చినా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లపై తగు చర్యలు తీసుకోనున్నట్లు, వారి సర్టిఫికెట్ రద్దు చేయాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీతో పాటు ఫార్మసీ కౌన్సిల్‌కి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్, కరీంనగర్ జిల్లా హెచ్‌ఆర్డీఏ సెక్రెటరీ డాక్టర్ రితేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment