సమ్మర్ యాక్షన్ ప్రణాళిక
హన్మకొండ : వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తమయ్యారు. గతేడాది డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాదిలో పెరిగిన విద్యుత్ సర్వీస్ ప్రకారం వేసవి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. డివిజన్ల వారీగా డిమాండ్, సరఫరాను లెక్కించి రాబోయే వేసవిలో ఎంత మేరకు డిమాండ్ ఉంటుందో అంచనాకు వచ్చి ఈ మేరకు ఏయే ఏర్పాట్లు చేయాలో ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈ, ఏఈలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంతరాయాలు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. అత్యవసర సర్వీసులైన ఆస్పత్రి, మెడికల్ కాలేజీలు, పోలీస్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా వేసవిలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన, విద్యుత్ సరఫరా అందించేందుకు యాజమాన్యం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ (పట్టణాలు, నగరంలో)లో విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు అంతరాయాలు లేకుండా ఉండేందుకు వ్యవస్థను పటిష్ట పరుస్తూ, 11కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ ఫీడర్లు ఏర్పాట్లు చేశారు.
హనుమకొండ సర్కిల్‌లో
నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం
హనుమకొండ సర్కిల్‌లో రూ.9.95 కోట్లతో ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో మొదటిసారిగా ఇండోర్ సబ్ స్టేషన్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. కడిపికొండలో రూ.6.05 కోట్ల అంచనాతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించి విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు కొత్తగా హనుమకొండ వాజ్‌పేయి నగర్‌లో రూ.6 కోట్లతో, హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో రూ.7.64 కోట్ల అంచనాతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. న్యూ శాయంపేటలోని డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో రూ.7 కోట్ల అంచనాతో చేపట్టిన సబ్ స్టేషన్ నిర్మాణం కొనసాగుతోంది. హనుమకొండ నక్కలగుట్ట సబ్ స్టేషన్‌లో 8 మెగావాట్స్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో రూ.2.35 కోట్లతో 12.26 మెగా వాట్స్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. యాదవనగర్ సబ్ స్టేషన్‌లో 5 ఎంవీఏ స్థానంలో రూ.1.09 కోట్లతో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. ధర్మాపూర్ సబ్ స్టేషన్‌లో అదనంగా రూ.90 లక్షలతో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా 127 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు. అదనంగా 109 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. రూ.4.52 కోట్లతో సబ్ స్టేషన్ల మధ్య ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు నిర్మిస్తున్నారు.
వరంగల్ సర్కిల్‌లో
వరంగల్ సర్కిల్‌లో రూ.5.50 కోట్లతో వేసవి ముందస్తు ప్రణాళిక రూపొందించారు. పోచమ్మమైదాన్ సబ్ స్టేషన్‌లో అదనంగా మరో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. శంభునిపేట సబ్ స్టేషన్‌లో 12.5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్, అజంజాహి మిల్ సబ్ స్టేషన్‌లో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఓవర్ లోడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో అధిక సామర్థ్యమున్న ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. వీటిని ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని అదే విధంగా అవసరమైన చోట అదనపు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుని అధికారులు ముందుకు పోతున్నారు.
విద్యుత్ సమస్యల నివారణకు
టీజీఎన్పీడీసీఎల్ ముందస్తు ప్రణాళిక
అధిక లోడ్ మేరకు సబ్ స్టేషన్ల
సామర్థ్యం పెంపు
అదనపు డిస్ట్రిబ్యూషన్
ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
రూ.5.50 కోట్లతో వరంగల్ సర్కిల్..
రూ.9.95 కోట్లతో హనుమకొండ
సర్కిల్‌లో పనులు
ప్రణాళికతో పనులు చేస్తున్నాం
వేసవిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎండీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఆచరిస్తున్నాం. ఏ సమయంలో ఏయే పనులు చేయాలో నిర్ధిష్టమైన కార్యాచరణ తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తున్నాం.
– కె.వెంకటనారాయణ, మధుసూదన్ రావు,
ఎస్‌ఈలు, హనుమకొండ, వరంగల్ సర్కిళ్లు
Comments
Please login to add a commentAdd a comment