అక్రమ డిప్యుటేషన్లు
ఎంజీఎం : హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లతో చాలా మంది ఉద్యోగులు జిల్లా కేంద్రాన్ని దాటకుండా విధులు నిర్వర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల సిఫారసు లేఖలతో పైరవీలు చేసుకుంటూ అక్రమ డిప్యూటేషన్లతో జిల్లా కేంద్రంలోనే కొలువు చేస్తున్నారు. గత డీఎంహెచ్‌ఓ హయాంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా డిప్యుటేషన్ల ఉత్తర్వులు ఇచ్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లతో జిల్లా కేంద్రానికే పరిమితమవుతున్నారు. ఎల్కతుర్తి వైద్యాధికారి, పంథిని వైద్యాధికారి, ముల్కనూరు హెచ్‌ఈఓలు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోనే తిష్ట వేశారు. శాయంపేట వైద్యాధికారి, కమలాపూర్ వైద్యాధికారి, ముప్పారం వైద్యాధికారులు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డిప్యుటేషన్లు పొంది గ్రామీణ ప్రాంత ప్రజల సేవలకు స్వస్తి పలికారు. అధికారులు పల్లెల్లో వైద్యసేవలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 పడకలు న్న పీహెచ్‌సీలో కాన్పులు సైతం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలోని వైద్యసిబ్బందికి కార్యాలయ సిబ్బంది ఒత్తిళ్లతో డిప్యుటేషన్ కేటాయించడంపై అనుమానాలకు తావిస్తోంది. వంగర పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులతో పాటు హెడ్‌నర్సును వేరే ప్రాంతాలకు విధులకు కేటాయించడంపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైద్యారోగ్యశాఖలో పైరవీలు
జిల్లా కేంద్రంలోనే కొలువులు
పట్టణాలకే పరిమితమవుతున్న
వైద్యులు, సిబ్బంది
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు స్వస్తి
పోస్టింగ్ లేకున్నా ఉత్తర్వులు
నవంబర్ 26వ తేదీన నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఓ హెడ్‌నర్సు వంగరలో పదోన్నతిలో భాగంగా పోస్టింగ్ తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీన వంగరలో బాధ్యతలు స్వీకరించిన సదరు హెడ్‌నర్సుకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఓ కీలక అధికారి సహాయంతో వారం రోజుల్లోనే జిల్లా కోర్టుకు డిప్యుటేషన్ ఉత్తర్వులు తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు ఉద్యోగి గతంలో జీఎంహెచ్‌లో స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వర్తించింది. కాగా సదరు హెడ్‌నర్సు డిప్యుటేషన్ పొందిన స్థానం జిల్లా కోర్టులోని ఫస్ట్ ఎయిడ్ కేంద్రం. అయితే ఈ కేంద్రంలో స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంల సేవలు సరిపోతాయి. హెడ్‌నర్సు విధులు నిర్వర్తించే ప్రదేశం కాకపోయినా అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment