రాంపూర్ అటవీ ప్రాంతంలో పులి జాడ
● గుండాల వైపునకు వెళ్లినట్లు గుర్తింపు
కొత్తగూడ: పులి సంచారం కొంత కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడ మండలం ఓటాయి నార్త్ బీట్ రాంపూర్ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు. కెమెరాలకు చిక్కకుండా.. మనుషులకు కనిపించకుండా.. సాదు జంతువులపై దాడికి పాల్పడకుండా పులి సంచారం కొనసాగుతోంది. రాంపూర్ అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లను బట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల వైపునకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో పులి సంచారంపై కొనసాగుతున్న ఉత్కంఠ ముగిసినట్లే అని చర్చ సాగుతోంది. గతంలోనూ ఇదే అటవీ ప్రాంతం నుంచి కిన్నెరసాని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈసారి అదే తరహలో వెళ్లి పోయి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అడుగుల ఆధారంగా మగ పులి అయి ఉంటుందని డీఎఫ్‌ఓ తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, ఎఫ్‌ఆర్వో వజరహత్, కొత్తగూడ రేంజ్ డీఆర్వోలు, ఎఫ్‌ఎస్వోలు, ఎఫ్‌బీఓలు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment