● బల్దియాకు కొంత ఉపశమనం
● పెండింగ్ నిధులు విడుదల చేసిన
రిజిస్ట్రేషన్స్ శాఖ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌కు ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయి నిధులను రిజిస్ట్రేషన్ శాఖ బుధవారం విడుదల చేసింది. 2019 నుంచి స్టాంప్ డ్యూటీ బకాయిలు పూర్తి స్థాయిలో మంజూరు చేసింది. మహా నగరానికి రూ.173 కోట్ల నిధులను ట్రెజరీ పీడీ అకౌంట్‌కు బదిలీ చేసింది. ఈనిధులను అధికార, ఉద్యోగ, కార్మిక వర్గాల వేతనాలు, సీసీ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తదితర అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బల్దియాకు ఊరట..
వేతనాలు, పింఛన్లు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, విద్యుత్ బిల్లులు, ఐటీ, జీఎస్టీలను చెల్లించడం భారంగా మారిన బల్దియాకు ఈ నిధుల విడుదలతో కొంత ఉపశమనం కలగనుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ వద్ద దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయడంపై అధికార యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగ విరమణ పొందిన వారికి లభించే కనీస సొమ్ము చెల్లించలేక రెండేళ్లుగా వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు చేస్తోంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండో రాజధాని వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చెల్లింపులు పోగా.. మిగిలిన నిధులు వివిధ అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సమకూర్చనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment