లక్ష మందితో బీసీ యుద్ధభేరి సభ
● ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న నిర్వహించనున్న బీసీ యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కేయూ దూరవిద్య కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్‌హాల్‌లో బీసీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతోందని, అందుకే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లక్షమందితో జరగబోయే బీసీ యుద్ధభేరి బహిరంగసభకు బీసీలు ఐక్యంగా తరలివచ్చి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలోని బీసీ విద్యార్థులంతా తరలిరావాలన్నారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మేడారపు సుధాకర్, నరేశ్, బీసీ విద్యార్థి సంఘం బాధ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత దూరవిద్య కేంద్రంలోని మహాత్మాజ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలువేశారు. అంతకుముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సభాస్థలిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతోపాటు వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, బీసీ నేత సుందర్‌రాజు యాదవ్, బీసీ నేతలు, కుల సంఘాల బాధ్యులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment