పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఎంజీఎం : వరంగల్ జిల్లా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న 104 కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా వేతనాల అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 104 ఉద్యోగులతో కలిసి బుధవారం నల్ల రిబ్బన్ ధరించి డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదనాయక్ మాట్లాడుతూ.. 104 ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు ఆరు నెలలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగులకు చెల్లింపు పూర్తయినా.. ఒక్క వరంగల్ జిల్లాలోనే వేతనాలు విడుదల చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు మూడు రోజుల్లో విడుదల చేయాలని లేకపోతే ఈనెల 27న వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో 104 ఉద్యోగులు పర్లపల్లి శ్రీనివాస్, రాజ్‌కుమార్, సృజన, మధు, క్రాంతికుమార్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment