మేడ్చల్/మేడ్చల్ రూరల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్‌లో విద్యార్థులకు పురుగుల భోజనం పెడుతున్నారని బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..మల్లారెడ్డి యూనివర్సిటీ ఆవరణలోని వసతి గృహాల్లో వందలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వర్సిటీ యాజమాన్యమే వీటిని నిర్వహిస్తోంది. సోమ, మంగళ వారాల్లో రెండు పూటలా భోజనంలో పురుగులు రావడం, జ్యూస్ నాసిరకంగా ఉండడంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు.
అయినా బుధవారం రాత్రి మళ్లీ భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహం ఎదుట బైఠాయించి..భోజనం చేయకుండా నిరాహార దీక్షకు దిగారు. దీంతో హాస్టల్ నిర్వాహకులు వచ్చి తప్పును సరిదిద్దుతామని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కానివ్వమని సర్ధిచెప్పి విద్యార్థుల ఆందోళనను విరమింపజేశారు. కాగా రూ.లక్షల్లో ఫీజులు తీసుకుంటూ తమకు నాసిరకం భోజనం పెట్టడం ఎంతవరకు న్యాయమని విద్యార్థులు ప్రశ్నించారు. హాస్టల్‌లో జాయిన్ అయినప్పడు చూపిన మెనూలోని ఆహార పదార్థాలు ఏవీ ఇవ్వడం లేదని ఆరోపించారు. పురుగుల భోజనం కారణంగా తరచు అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment