సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో తరచూ తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, మెరుగైన సరఫరా కోసం డిస్కం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం‘థర్మో విజన్’ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. కంటికి కన్పించని అతి సూక్ష్మమైన లోపాలను కూడా ఈ కెమెరాతో గుర్తించే అవకాశం ఉంది. రాబోయే ముప్పును ముందే పసిగట్టడం ద్వారా సరఫరాలో అంతరాయాలను నివారించొచ్చు. ప్రస్తుతం గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 35 కెమెరాలను సమకూర్చింది. తద్వారా జాయింట్లలో లోపాలు, సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లపై పడుతున్న ఒత్తిడి, ట్రాన్స్‌పార్మర్లలో ఆయిల్ లీకేజీలు, కేబుళ్లలో తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. నిజానికి భగ్గున మండే ఎండలకు తోడు అధికలోడు కారణంగా ఇన్సులేటర్ల మధ్య పగుళ్లు ఏర్పడుతుంటాయి. వర్షపు చినుకులు పడగానే టఫ్...మంటూ పేలిపోతుంటాయి. లైన్లు, జాయింట్ల మధ్య లూజు కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ ప్రసారం జరిగే క్రమంలో చర్..చర్..మనే శబ్ధంతో ఎర్రటి మినుగురులు ఎగిసిపడుతుంటాయి. షార్ట్‌సర్క్యూట్ తలెత్తి..వైర్లు తెగిపడే వరకు ఈ సమస్య గుర్తించలేని దుస్థితి. ఈ కెమెరాతో ఈ లోపాలను ముందే గుర్తించే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఆపరేషన్స్ విభాగం ఇంఛార్జీ డైరెక్టర్ నరసింహులు, సీఈ నరసింహస్వామి, బాలస్వా మిలతో కూడిన ఇంజనీర్ల బృందం ఈ థర్మోవిజన్ పరికరాల పనితీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment