సంతకే..
‘సంపుల’ సంగతి
● ఈ ఏడాది 50 చోట్ల నిర్మించాలనుకున్నా..10 ప్రాంతాల్లోనే పనులు ప్రారంభం
● ఒక్కటీ పూర్తవని వైనం..నగరవాసికి తప్పని వాన కష్టాలు
వాటర్ లాగింగ్ ఏరియాల్లో ప్రహసనంగా నీటి సంపుల నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఏమాత్రం వాన కురిసినా రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులతో పాటు రోడ్లు గుంతలమయమై వాహనదారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఎస్‌ఎన్‌డీపీ వంటి ప్రాజెక్టుల కింద దాదాపు వెయ్యికోట్లతో పనులు చేపట్టింది. వరద కాలువల ఆధునీకరణ తదితర పనులు వాటిల్లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఏడాది రెయిన్‌వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (రోడ్ల కింద పెద్ద సంపులు) నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. వర్షాలతో రోడ్లపై భారీగా నిలుస్తున్న నీరు భూమి లోపల..రోడ్ల కింద నిర్మించే పెద్ద సంపుల్లోకి వెళ్లేలా పనులు చేయాలనుకున్నారు. ఈ మేరకు వాటర్‌లాగింగ్ సమస్యలెక్కువగా ఉన్న 50 ప్రాంతాల్లో రోడ్ల కింద సంపులు నిర్మించాలనుకున్నారు. తొలుత జోన్‌కు రెండు చొప్పున కనీసం 12 ప్రాంతాల్లోనైనా ఈ వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా చేయాలని వర్షాకాలానికి ముందే నిర్ణయించారు. వర్షాకాలం లోపునే వాటిని నిర్మిస్తే చాలా వరకు సమస్యలు తగ్గగలవని భావించారు. కానీ ఇంతవరకు ఒక్కచోట కూడా సదరు నిర్మాణాలు పూర్తికాలేదు. పనులు పురోగతిలో ఉన్న ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సదరు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయా నిర్మాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హెచ్చరిక బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు.
23 సంపులకు టెండర్లు పిలిచినా..
ఈ సీజన్‌లో 23 సంపుల నిర్మాణం పూర్తి చేయాలని పనులకు టెండర్లు పిలిచారు. వివిధ కారణాల వల్ల పనులు పూర్తికాలేదు. కొన్నింటికి టెండర్లే పూర్తికాలేదు. కొన్ని చోట్ల పనులు కుంటుతున్నాయి. వర్షాలు కురుస్తుండటం కూడా ఇందుకు ఒక కారణం. మరోవైపు జీహెచ్‌ఎంసీలో నిధుల లేమి కూడా పనులు కుంటుతుండటానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాల సీజన్‌కు ఆశించిన సంపుల వల్ల ప్రయోజనం నెరవేరలేదు. వర్షాలు పూర్తి గా ఆగిపోయాక కానీ పను లు ముందుకు సాగేలా లేవు. సో.. ఈ సంవత్సరానికి ఎప్పటిలాగే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి మారలేదు.
Comments
Please login to add a commentAdd a comment