● నామమాత్రపు రుసుంతో పార్కింగ్ సదుపాయం
● సూపర్ సేవర్, స్టూడెంట్ పాస్‌ల ఆఫర్లు పొడిగింపు
సాక్షి, సిటీబ్యూరో: నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్‌ల వద్ద ఇటీవల పెంచిన పార్కింగ్ రుసుముపైన ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ వెనకడుగు వేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుముతో అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికులపైన పార్కింగ్ ఫీజు పెంపుతో ఇటీవల విద్యార్ధి, యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణ చార్జీల్లో భాగంగానే ఉచితపార్కింగ్ సదుపాయాన్ని కల్పించవలసి ఉండగా, అందుకు భిన్నంగా వాహనాల పార్కింగ్ పైన కూడా రుసుము వసూలు చేయడం పట్ల ప్రయాణికుల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ప్రస్తుతం నామమాత్రపు రుసుముతోనే పార్కింగ్ వసతి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక ఆఫర్ల పొడిగింపు....
నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న లక్షలాది మంది ప్రయాణికులు వినియోగించుకొనే సూపర్‌సేవర్ ఆఫర్ –59 పథకాన్ని వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రయాణికులు కేవలం రూ.59 టిక్కెట్ చార్జీలతో రోజంతా ప్రయాణం చేయవచ్చు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన సెలవు రోజుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన స్టూడెంట్ పాస్‌లను కూడా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పాస్‌లపైన విద్యార్ధులు 20 ట్రిప్పులకు మాత్రమే చార్జీలు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేయవచ్చు. మరోవైపు స్మార్ట్ కార్డులపైన 10 శాతం రాయితీ లభించనుంది. ఆఫర్‌ల పొడిగింపుపైన హైదరాబాద్ ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, పార్కింగ్ సదుపాయాలను పెంచడంతో పాటు, ఆఫర్‌లను పొడిగించడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment