ఘనంగా సంకటహర చతుర్థి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్‌శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం చేశారు. హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులున్నారు.
నృసింహుడికి హైకోర్టు రిజిస్ట్రార్ పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని హైకోర్టు రిజిస్ట్రార్ రమేశ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం తరఫున స్వాగతం పలికారు. వారికి ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందించారు. సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
ఆయిల్ పాం సాగుపై రైతులకు అవగాహన
రాయికల్: ఆయిల్ పాం సాగుపై మండలంలోని ఆలూరులో సోమవారం ఉద్యానవన శాఖ అధికారి కందుకూరి స్వాతి అవగాహన కల్పించారు. ఆయిల్ పాం సాగుతో కోతుల బెడద, ప్రకృతి వైపరీత్యాల నష్టం ఉండదని, కచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుందని పేర్కొన్నారు. టన్నుకు ప్రస్తుతం రూ.19వేల వరకు ధర ఉందన్నారు. ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తుందని, మూడేళ్లకే దిగుబడి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, రైతు సంఘం నాయకులు మెక్కొండ రాంరెడ్డి, రాజేశ్‌యాదవ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాజగోపురం పనులు చేపట్టాలి
వెల్గటూర్: కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయంలో రాజగోపురం పనులు త్వరగా చేపట్టాలని మేఘా కంపెనీ జీఎం రవికి ఆలయ ఈవో కాంతారెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టులో రూ.2.50 కోట్ల అంచనాతో ఆలయ రాజగోపురం పనులకు అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా భూమిపూజ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజగోపురం పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ఈవో కాంతారెడ్డి మేఘా కంపెనీ జీఎం రవిని కలిసి పనులు పునఃప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు సంజీవ్‌శర్మ పాల్గొన్నారు.
రాయికల్ మున్సిపాల్టీకి పోస్టులు మంజూరు
రాయికల్: మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మంజూరైనట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు సోమవారం తెలిపారు. గతంలో కమిషనర్ జీతభత్యాలు బల్దియా నుంచి చెల్లించేవారు. ప్రభుత్వం పోస్టులు మంజూరు కావడంతో ఎస్పీవో ఆఫీస్ నుంచి చెల్లించే అవకాశం ఉండటంతో బల్దియాకు ఆర్థిక భారం తప్పనుంది.
Comments
Please login to add a commentAdd a comment