మహిళలకు ‘భరోసా’
జగిత్యాలక్రైం: బాధిత మహిళలు, చిన్న పిల్లల కు భరోసా కేంద్రం ద్వారా సత్వర సేవలు అందుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తోందన్నారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం ఇప్పించడానికి వివిధ శాఖల అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సీసీ రంజిత్‌రెడ్డి, భరోసా సిబ్బంది ఉన్నారు.
కొండగట్టు ఆలయ అర్చకునికి మెమో జారీ
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ అర్చకుడికి మంగళవారం ఆలయ అధికారులు మెమోజారీ చేశారు. అర్చకుడు నాలుగు రోజుల కిత్రం దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులు, ఆలయంలో అష్టోత్తర టికెట్ తీసుకునే క్రమంలో టికెట్ వద్దంటూ భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆలయ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు పోచమల్ల ప్రవీణ్ కుమార్ ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆయన సీసీ కెమెరాలను పరిశీలించి అర్చకుడికి మెమో జారీ చేశారు.
ధర్మపురిలో కుజదోష నివారణ పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి కుజదోష నివారణ పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.
అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్
జగిత్యాల: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాటరు. మంగళవారం వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్‌ను ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎలేటి ముత్తయ్యరెడ్డి, అంజయ్య, రాందాస్, రమేశ్, జ్యోతి, కొమురయ్య పాల్గొన్నా రు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీధర్ తెలిపారు.
గ్రామసభను బహిష్కరించిన భూ నిర్వాసితులు
మేడిపల్లి: సూరమ్మ చెరువు కుడి కాలువ నిర్మాణం కోసం భీమారం మండలం గోవిందారంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని, భూములు కోల్పోతున్న వారంతా సన్న, చిన్నకారు రైతులేనని, భూములు ఇవ్వడం కుదరదని ఏకగ్రీవ తీర్మానం చేసి రెవెన్యూ అధికారులకు అందించారు. అంతకుముందు రంగాపూర్ వరద కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వాలని కోరారు.
6, 7న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్
జగిత్యాల: ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్‌ను జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలకు అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment