అర్ధరాత్రి వరకు గురుకులంలోనే..
కోరుట్ల: పెద్దపూర్ గురుకులంలో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో 8 మందికి ప్రాణాల మీదకు వచ్చినా వరుస ఘటనలకు కారణాలు ఏమిటన్న విషయంలో అధికారుల్లో స్పష్టత లేదు. గణాదిత్య, అనిరుద్ ఏలా చనిపోయారన్న విషయంలో స్పష్టత కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు శాంపిళ్లు పంపిన అధికారులు వాటి నివేదిక ఏమిటన్న విషయం వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల మృతికి కారణాలు తెలియకుండా చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అత్యవసర పరిస్థితి కాదా..?
ఒకే గురుకులంలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం వరుసగా మరికొంత మంది అస్వస్థతకు గురి అవుతున్న విషయంలో కారణాలు తెలుసుకోవడం అత్యవసం కాగా, అధికారులు మాత్రం ఇప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రాలేదని చెప్పడం విడ్డూరం. పెద్దాపూర్ గురుకులంలో సుమారు 410 మంది విద్యార్థులు ఉండగా వరుస ఘటనలతో వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. 30 ఏళ్లుగా ఇక్కడ వేలాది మంది చదువుకోగా ఏనాడు ఇలాంటి ఘటనలు జరగలేదు. అకస్మాత్తుగా పాముకాటు పేరిట విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఏలా జరుగుతుందన్న విషయంలో లోతుగా విచారణ జరగడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక తెప్పించడంలో ఎందుకింత ఆలస్యం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలు పోవడం అత్యవసర పరిస్థితి కాదా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా సుమారు రూ.50 లక్షలు వెచ్చించి చర్యలు చేపట్టినా మళ్లీ అఖిల్, యశ్విత్‌ల చేయి, కాలుపై పాముకాట్లు కనిపించడం గమనార్హం.
రక్తం ఎందుకు పలుచబడుతోంది..?
సాధారణంగా ఒక రకమైన పాము కాటు వేసినప్పుడు కాటుకు గురైన వ్యక్తి రక్తం పలుచబడి అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంది. పాముకాటుగా గుర్తించక ఏలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వకపోతే 48 గంటల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గురు, శుక్రవారాల్లో పాముకాట్లకు గురైనట్లుగా భావిస్తున్న అఖిల్, యశ్విత్‌లకు రక్తం గడ్డకట్టే సమయం పెరిగింది. సాధారణంగా 20 నిమిషాల్లో రక్తం గడ్డకట్టకుంటే వారిలో పాముకాటు ప్రభావం ఉన్నట్లుగా వైద్యులు భావిస్తారు. అఖిల్, యశ్విత్‌ను ఆసుపత్రికి తరలించిన అనంతరం పరీక్షలు నిర్వహిస్తే రక్తం గడ్డకట్టే సమయం 20 నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. పాముకాటుతో రక్తం పలుచబడితే శరీరం లోపల అవయవాల్లో రక్తస్రావం జరిగి కిడ్నీలు దెబ్బతిని స్పహాలేని స్థితికి చేరుకుంటారు. తర్వాత మరణం సంభవిస్తుంది. రక్తం గడ్డకట్టే సమయం పెరగడంతో వైద్యులు వెంటనే యాంటి స్నేక్ వీనమ్ చికిత్స అందించారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిలో రక్తం గడ్డకట్టే స్థాయి సాధారణ స్థితికి రావడంతో శుక్రవారం సాయంత్రం యశ్విత్‌ను డిశ్చార్జి చేశారు. అఖిల్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఆరు నెలల వ్యవధిలో చనిపోయిన ఇద్దరు విద్యార్థులతో పాటు కోలుకున్న ఆరుగురు విద్యార్థులకు వైద్యులు యాంటి స్నేక్ వీనమ్ చికిత్స అందించడం గమనార్హం. అయినా అధికారులు మాత్రం పాముకాటు కాదన్న తీరుగా వ్యవహరించడం తల్లిదండ్రుల్లో సందేహాలకు తావిస్తోంది.
పాముల సంచారం ఆపలేమా.. ?
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన అనంతరం రూ.50 లక్షల నిధులు వెచ్చించి విద్యార్థులకు స్టెప్ బెడ్స్, కిటికీలకు జాలీలు, సీసీ కెమెరాలు, రాత్రి వేళ వెలుగు కోసం హైమాస్ట్ లైట్లు, టాయ్‌లెట్లు, రంగులు వేసి పరిసరాలు పరిశుభ్రం చేసినా పాముల సంచారం తగ్గలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం గురుకులంలోని బావిలో ఓ పాము కనిపించడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. వాస్తవానికి గురుకులం పరిసరాల్లో వందల ఎకరాల్లో పొలాలు, చేన్లు ఉన్నాయి. వీటిలో ఎలుకల కోసం సంచరించే పాములు ఉండటం సహజం. పొలాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లడంతో వాటి తాకిడిని తట్టుకోలేని ఎలుకలు, పాములు గురుకులం పరిసరాల్లోకి వస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులం ప్రహరీకి లింకులు ఉన్న చోటుతో పాటు కింది భాగంలోనూ పెద్దపెద్ద గ్యాప్‌లు ఉన్నాయి. వీటి నుంచి పాములు పాఠశాల పరిసరాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరింత శ్రద్ధపెట్టి పాముల సంచారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
విద్యార్థుల అస్వస్థత ఘటనతో అధికారుల అప్రమత్తం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం వేకువజాము నుంచే గురుకులంలో ఉన్న అధికారులు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తిరిగి వెళ్లిపోయారు. వసతి గదుల్లోని విద్యార్థుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తర్వాత సామగ్రిని మరో గదిలోకి తరలించారు. గదుల్లో ఏమైనా రంధ్రాలాంటివి ఉన్నాయా అని పరిశీలించి,శుభ్రం చేయించారు. విద్యార్థులు నిద్రించే గదుల్లో ఏ ఒక్క సామగ్రి ఉండకుండా, కేవలం నిద్రించేందుకు అవసరమగు దుప్పట్లనే ఉంచారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల ధైర్యం కల్పించారు. రాత్రి సమయాల్లో వసతి గదుల ఆవరణలోకి విషకీటకాలు ఏమైనా సంచరిస్తున్నాయా అని చుట్టూ తిరుగుతూ పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రామకృష్ణ, వైద్యాధికారి అంజిత్‌రెడ్డి తదితరులు అర్ధరాత్రి వరకు గురుకులంలోనే గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment