పనిమనుషుల్లా క్రీడాకారులు..!
● విమర్శలకు తావిచ్చేలా సీఎం కప్ క్రీడల నిర్వహణ
జగిత్యాలటౌన్: సీఎం కప్–2024 క్రీడల నిర్వహణలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులతో జిల్లా క్రీడల అధికారి కార్యాలయ సిబ్బంది స్విమ్మింగ్ ఫూల్ క్లీన్ చేయించడం వివాదాస్పదంగా మారింది. క్రీడల నిర్వహణ షెడ్యూల్ ముందే నిర్ణయించిన అధికారులు తీరా సమయం వరకు స్మిమ్మింగ్ ఫూల్ క్లీన్ చేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. పైగా స్మిమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు గ్రీన్‌నెట్‌లు అప్పగించి స్మిమ్మింగ్ ఫూల్ క్లీన్ చేయించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని సిబ్బందిని ప్రశ్నించగా కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోవడం విశేషం. డ్రాప్ అవుట్స్‌ను గుర్తించి విద్యాభోదన చేయాల్సిన అధికారులే క్రీడాకారులతో పనులు చేయించడంపై క్రీడాకారుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా క్రీడల అధికారి రవికుమార్‌ను ప్రశ్నించగా.. వారు స్మిమ్మర్లని, తాము వారికి పని చెప్పలేదని, వారికివారుగానే స్మిమ్మింగ్ ఫూల్‌లోకి దిగారని స్మిమ్మింగ్ ఫూల్‌లో చెత్త నిండి ఉండటంతో వారే క్లీన్ చేశారంటూ పొంతన లేని సమాధానం చెప్పడం గమనార్హం. క్రీడాకారుకు గ్రీన్ నెట్లు ఎవరిచ్చారని ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. డీఈవోను వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాలేదని, సంబంధిత అధికారి నుంచి వివరాలు తెలుసుకుంటాననడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment