సహకరించరు!
● శాతవాహన వర్సిటీలో తేలని బిల్లుల లొల్లి ● ‘విజిలెన్స్’ అడిగినా నేటికీ సమర్పించని వర్సిటీ ● దాదాపు రూ.50 కోట్ల భవనాల బిల్లులపై నాన్చుడు ధోరణి ● టెండర్లు ఏకపక్షంగా కట్టబెట్టిన వైనం ● తవ్వుతున్న కొద్దీ వెలుగుచూస్తున్న అధికారుల అవకతవకలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన వర్సిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. దాదాపు ఆర్నెళ్ల క్రితం మొదలైన విజిలెన్స్ విచారణ నేటికీ ముందడుగు పడడం లేదు. విచారణ అధికారులు ఎక్కడికక్కడ ఆధారాలు సేకరిస్తుంటే.. మరోవైపు వర్సిటీ అధికారులు సహకరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఈ ఏడాది జూన్18న హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లోగల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో కరీంనగర్‌కు చెందిన కొందరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నిజనిజాలు ఏంటో తేల్చాలంటూ అక్కడ నుంచి స్థానిక విజిలెన్స్ కార్యాలయానికి సదరు ఫిర్యాదును బదిలీ చేశారు.
మొదటి నుంచీ అరకొరే
సదరు ఫిర్యాదు మొత్తం 160 పేజీల మేర ఉంది. ఇందులో అనేక అంశాల ప్రస్తావన ఉంది. భవన నిర్మాణాలు, పేపర్ వాల్యూయేషన్, టెండర్లు పిలవకుండా కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, పాలకమండలిలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు తదితరాలలోని లోపాలను ఎత్తిచూపాయి. వాస్తవానికి విజిలెన్స్ వద్ద తగినంత సిబ్బంది లేని కారణంగా ఫిర్యాదు అధ్యయనానికే దాదాపు రెండు నెలలు పట్టింది. ఎందుకంటే.. ఇందులో సివిల్, ఆడిటింగ్, టెండర్లు తదితర విభిన్న అంశాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా అంశాల్లో నిపుణులతో భేటీ అయి, వారి అభిప్రాయాలు తీసుకుని విచారణ ప్రారంభించారు. వాటి ఆధారంగా అధికారులకు ప్రశ్నావళి రూపొందించి పంపారు. దీనికి పైఅధికారులు అనుకున్నంత వేగంగా స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి అరకొర సమాధానాలు ఇస్తూ.. దర్యాప్తునకు పెద్దగా సహకరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.50 కోట్ల వరకు బిల్లులు
గత పాలకమండలి సమయంలో నిర్మించిన భవనాల విషయంలోనూ అవకతవకలు ఉన్నాయని విజిలెన్స్‌కు ఫిర్యాదు వచ్చింది. వీటి విషయంలో స్పష్టత కోసం విజిలెన్స్ వాటి బిల్లులు సమర్పించాలని అధికారులను కోరింది. అయితే.. ఈ విషయంలో అధికారులు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని సమాచారం. దాదాపు రూ.50 కోట్లకు సంబంధించి బిల్లుల చెల్లింపుపై ఇంతవరకూ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు వర్సిటీ అధికారులను తరచూ సంప్రదిస్తున్నా.. రేపు, మాపు అంటూ జాప్యం చేస్తున్నారు తప్ప ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రూ.50 కోట్ల వరకు భవనాలకు సంబంధించిన బిల్లులు ఇంతవరకూ ఎందుకు ఇవ్వడం లేదన్న విషయంలోనూ విజిలెన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టెండర్ల విషయంలోనూ గత పాలకులు ఏకపక్షంగా వ్యహరించారన్న ఆరోపణలు కూడా క్రమంగా బలపడుతున్నాయి. వర్సిటీకి సంబంధించిన కొన్ని పనుల్లో టెండర్లు పిలవకుండానే.. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయంలో ముఖ్యంగా పేపర్ వాల్యుయేషన్‌లో ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల నియామకంలోనూ పాలకమండలి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయాల్లోనూ కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment