మండలంగా అల్లీపూర్..?
● జిల్లాలో మరో కొత్త మండలం
● వేగంగా కదులుతున్న ఫైళ్లు ● అధికారిక ప్రకటనే తరువాయి
రాయికల్: జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. రాయికల్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అల్లీపూర్‌ను మండలకేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయి. అల్లీపూర్‌ను మండలం చేయాలని గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మండలం ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి.
11 గ్రామాలతో మండలం..
వాస్తవానికి రాయికల్ జిల్లాలోనే పెద్ద మండలం. ఈ మండలంలో 32 గ్రామాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా సరిహద్దు వరకు విస్తరించి ఉంది. పైగా రాయికల్ పట్టణం మున్సిపాలిటీగా ఉంది. ఈ క్రమంలో అల్లీపూర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది. అల్లీపూర్‌తోపాటు అయోధ్య, ఉప్పుమడుగు, శ్రీరాంనగర్, సింగరావుపేట, ఆలూరు, కిష్టంపేట, కుర్మపల్లి, రాజనగర్, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట గ్రామాలతో మండలం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో కొన్నాళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త మండలం ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు అల్లీపూర్, ఉప్పుమడుగు, కిష్టంపేట, ఆలూరు, నాగునూర్, లచ్చక్కపేట రెవెన్యూ గ్రామాల్లోని రైతులు, జనాభా వివరాలు సేకరించారు. అల్లీపూర్ మండలకేంద్రంగా ఏర్పడితే ప్రభుత్వ భూముల విస్తీర్ణం, కార్యాలయాలకు అవసరమయ్యే స్థలాలు వంటి ప్రతిపాదనలు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
అల్లీపూర్‌లో అన్నీ అనుకూలమే..
అల్లీపూర్ మండలకేంద్రంగా ప్రకటించడానికి గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉంది. మహాత్మజ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సెస్సీ ఎగ్జామ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌సెంటర్, పశువైద్య సబ్‌సెంటర్ ఉన్నాయి. కేడీసీసీ బ్యాంక్ కూడా ఉండడం అనుకూలమైన అంశాలు. పైగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తమ ఎన్నికల ప్రచారంలో కూడా తాము ఎమ్మెల్యేగా గెలిస్తే అల్లీపూర్‌ను మండలం చేస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లే వీరంతా మండలం ఏర్పాటుకు సానుకూలంగా ఉండడం.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అల్లీపూర్ ప్రజల దశాబ్దాల కల మరికొద్ది రోజుల్లోనే నెరవేరనుంది.
మండలం ఏర్పాటుకు సానుకూలం
అల్లీపూర్‌ను మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గ్రామస్తులు వీరిని వేర్వేరుగా కలిసి మండలం ఏర్పాటు చేయాలని కోరారు. వారు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్పడంతో గ్రామస్తులు, జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు అల్లీపూర్‌ను మండలం చేయాలని జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
స్టేడియంలో మరమ్మతు చేయించండి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: వివేకానంద స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన మరమ్మతు చేయించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ‘పని మనుషుల్లా క్రీడాకారులు’ శీర్షి క న ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. స్టేడియంను మంగళవారం తనిఖీ చేశారు. స్విమ్మింగ్‌పూల్ వాట ర్‌ను టెండర్ ద్వారా శుభ్రపర్చేలా చూడాలని, ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను క్లీనింగ్ చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేడియంలో ఏయే వసతులు అవసరమో చూడాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, కమిషనర్ చిరంజీవి, తహసీల్దార్ ఉన్నారు.
కేంద్ర హోంమంత్రి మాటలు బాధాకరం
జగిత్యాల: అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి మాటలు బాధాకరమని, ఆయన క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాగాంధీ చౌక్ నుంచి కొత్తబస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా శిక్షార్హులేనన్నారు. నేర ప్రవృత్తి కలిగిన అమిత్‌షాకు కేంద్ర హోంమంత్రి బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదన్నారు. ఈ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదని, యావత్ భారత దేశానికి సంబంధించిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగారావు, కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment