వనం వీడి జనంబాట పట్టండి
● రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
తంగళ్లపల్లి, సిరిసిల్లక్రైం: మావోయిస్టులు వనం బాట వీడి జనంబాట పట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘పోరు కన్నా ఊరు మిన్న– మన ఊరికి తిరిగి రండి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి ఉరుఫ్ జ్యోతక్కతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అందించే పునరావాసం, ఇతర సదుపాయాల గురించి వివరించారు. జ్యోతక్కకు రావాల్సిన పెండింగ్ సదుపాయాలను త్వరగా అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ ఉరఫ్ కోస ఉరఫ్ సాడు కుటుంబాన్ని ఎస్పీ సందర్శించారు. కోస కుటుంబ సభ్యులకు పండ్లు అందజేసి వారితో మాట్లాడారు. ప్రభుత్వం అందించే పునరావాసం, ఇతర సదుపాయాలు వివరించి కోస లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసేల కృషిచేయాలని వారిలో స్ఫూర్తి నింపారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment