రైతుల అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ డెయిరీపై వస్తున్న ఆరోపణలు సత్యదూరమని, రైతుల అభివృద్ధిని ఓర్వలేకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్‌రావు అన్నా రు. మంగళవారం డెయిరీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డెయిరీ నుంచి విష రసాయనాలు వెలువడుతున్నాయని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ కంపనీల చేతిలో కొందరు పావులుగా మారారన్న అనుమానం కలుగుతోందన్నారు. 55 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్నామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సంపూర్ణ సహకారమందించారని తెలిపారు. ప్రస్తుతం డెయిరీ రోజుకు 1.80 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోందని, వివిధ రకాల పాల ఉత్పత్తులకు 40 వేల లీటర్ల పాలను వినియోగిస్తున్నామని అన్నారు. 30 వేల లీటర్ల పాలను పౌడర్ తయారీకి చిత్తూరు పంపిస్తున్నామని తెలిపారు. లక్ష మంది రైతు కుటుంబాలతో డెయిరీ అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే చిల్లర ఆరోపణలు చేయడం తగదన్నారు. హైదరాబాద్, బెంగుళూర్‌లలో కూడా డెయిరీలు సిటీలోనే ఉన్నాయన్న విషయాన్ని మరవొద్దని సూచించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న డెయిరీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్.రాజేశ్వర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment