వణికిస్తున్న చలి.. తలదాచుకునే చోటేది..?
● అనాథల కోసం జిల్లాకేంద్రంలో నిరాశ్రయుల కేంద్రం ● 15 ఏళ్ల క్రితం ఏర్పాటు.. నిర్వహణకు ఏటా రూ.6లక్షలు ● వసతులు లేక వెనుకంజ ● అభాగ్యులకు ఫుట్‌పాత్‌లు, బస్టాండ్‌లే పెద్ద దిక్కు
జగిత్యాల: చలి గజగజ వణికిస్తోంది. ఇంట్లో పడుకుని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగడం లేదు. ఇంత చలిలో అనాథలు, భిక్షాటన చేసేవారి పరిస్థితిని తల్చుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ వారు బస్టాండ్, ఫుట్‌పాత్‌లపై పడుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే వీరి కోసం జిల్లాకేంద్రంలో 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రం మాత్రం నిరుపయోగంగా ఉంచడం విమర్శలకు తావిస్తోంది.
మున్సిపాలిటీల్లో అనాథలు, భిక్షాటన చేసేవారు, పట్టణానికి వచ్చి వారు రాత్రి అయితే ఇళ్లకు వెళ్లలేని వారి కోసం జిల్లా కేంద్రంలో 15 ఏళ్ల క్రితం నిరాశ్రయుల కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే ఈ కేంద్రంలో అనాథలు, వలస కార్మికులు తలదాచుకునే అవకాశం ఉంది. అలాంటి ఈ కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం ఎదుటగల బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నిర్వహణకు ఏటా రూ.6లక్షలు కేటాయిస్తున్నారు. కానీ.. అందులో తలదాచుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేంద్రం నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో వసతులు లేవు. నిబంధనల ప్రకారం ఈ కేంద్రంలో కేర్ టేకర్, వాచ్‌మన్ ఉండాలి. ప్రస్తుతం ఎవరూ విధులు నిర్వర్తించడం లేదు. ఇటీవలే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ గదికి మార్చారు. కానీ వసతులు కల్పించకపోవడంతో నిరాశ్రయులకు వినియోగించుకోవడంలేదు. మెప్మా, మున్సిపల్ అధికారులు నిరాశ్రయులను నామమాత్రంగా సర్వే చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నిధులు వస్తలేవని అధికారులు పేర్కొంటున్నారు.
రెండేళ్లుగా నిలిచిన నిధులు
నిరాశ్రయుల కేంద్రం నిర్వహణను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. జిల్లాకేంద్రంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మహిళాసమైక్యతో కొనసాగిస్తున్నారు. కేంద్రంలో భోజనం సౌకర్యం ఏర్పాటు చేయకున్నా.. బెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేంద్రానికి రెండేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోయినట్లు తెలిసింది. గతంలో వచ్చిన నిధులు ఏమయ్యాయో..?వాటిని ఎందుకు ఖర్చు పెట్టారో ఎవరికీ తెలియడం లేదు.
అధికంగానే నిరాశ్రయులు
జిల్లాకేంద్రంలో కొందరు నిరాశ్రయులు ఫుట్‌పాత్‌లు, బస్టాండ్‌లు, హోటళ్లలో రాత్రిపూట పడుకుంటారు. జిల్లాకేంద్రానికి వివిధ పనుల నిమి త్తం వచ్చి తిరిగి వెళ్లేందుకు సౌకర్యం లేనివారు కూడా బస్టాండ్, ఫుట్‌పాత్‌లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు ఇలాంటి వారిని గుర్తించి నిరాశ్రయుల కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. చాలామంది కూరగాయలు విక్రయించేందుకు జిల్లాకేంద్రానికి వస్తుంటారు. రాత్రి సమయంలో బస్సులు లేకుంటే ఈ కేంద్రాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ.. కేంద్రం ఉన్నట్టు వారికి కనీసం తెలియదంటే అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment