క్రికెట్ ఆడిన జడ్జిలు, అడ్వకేట్లు
జగిత్యాలజోన్: నాలుగు గోడల మధ్య నల్లకో టుతో బిజీగా ఉండే జడ్జిలు, అడ్వకేట్లు ఆదివారం కాసేపు మైదానంలోకి చేరి క్రికెట్ ఆడారు. జడ్జిలు ఒక జట్టుగా.. న్యాయవాదులు మరో జట్టుగా ఏర్పడ్డారు. ఈ పోటీలో ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ, మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జితేందర్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గంప కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాదులు ముదుగంటి జనార్ధన్ రెడ్డి, ఎన్.మురళీధర్‌రావు బ్యాటింగ్, బౌలింగ్ చేసి తమతమ జట్టు క్రీడాకారులను ఉత్సాహ పర్చారు.
క్రీడలతో మానసికోల్లాసం
మెట్‌పల్లి: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని మెట్‌పల్లి సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు, జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. వీటిని మేజిస్ట్రేట్‌లు ప్రారంభించారు. మేజిస్ట్రేట్, బార్ అసోసియేషన్ టీంలుగా తలపడగా.. బార్ అసోసియేషన్ టీం విజేతగా నిలిచింది. కార్యక్రమంలో అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, పలువురు న్యాయవాదులు ఉన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌కు ప్రజలు ఎవరూ రావద్దని, ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేలో అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
గోదావరిలో పుణ్య స్నానాలు
రాయికల్: పుష్యమాసం సందర్భంగా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని గోదావరిలో భక్తులు ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్నానాలు చేసి గోదారమ్మకు మొక్కులు చెల్లించారు.
వస్తువుల విక్రయాలకు నేడు వేలం
సారంగాపూర్: దుబ్బరాజన్న ఆలయంలో వివిధ వస్తువుల విక్రయాలకు సోమవారం వేలం వేయనున్నట్లు ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య తెలిపారు. వేలం దక్కించుకున్న వారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి వచ్చే ఏడాది జనవరి 31వరకు అమ్మకాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొబ్బరికాయలు, బెల్లం, పూజసామగ్రి అమ్ముకునేందుకు వేలంలో పాల్గొనేవారు రూ.2లక్షలు డిపాజిట్ చేయాలని, పూలు, పూలదండలు, పండ్ల అమ్ముకాలకు రూ.10వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఇతరత్రా విక్రయాలకు కూడా బహిరంగ వేలం ఉంటుందని తెలిపారు.
మహాసభ విజయవంతం చేయాలి
జగిత్యాల: సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment