యథేచ్ఛగా మట్టి దందా
వెల్గటూర్: అక్రమార్కులు ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారు. కాపాడాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా గుట్టలు మొత్తం తవ్వేసి కోట్లు గడిస్తున్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే ప్రతిరోజు యథేచ్ఛగా ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. అయినప్పటికీ మాఫియా వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల గురించి అధికార యంత్రాంగానికి తెలియకపోవడం గమనార్హం.
నూతన నిర్మాణాల కోసం..
రాజక్కపల్లి–వెల్గటూర్ శివారుల్లోని ఒడ్డెర కాలనీ పక్కనున్న గుట్టలను ఇష్టానుసారం తవ్వుతున్నారు. క్రమంగా గుట్టలను కనుమరుగు చేస్తున్నారు. రాత్రిపూట జేసీబీలు, ట్రాక్టర్లతో రాత్రంతా తరలిస్తున్నారు. ప్రజలు దుమ్ము, ధూళితోపాటు వాహనాల శబ్దాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెలరోజులుగా సాగుతున్న ఈ అక్రమ దందాతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు మైదానంలా మారాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం మామూలుగా చూసీ చూడనట్లు వదిలేయడంతో అక్రమ మట్టి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మండల కేంద్రంలో నూతన నిర్మాణాలకు మట్టి అవసరం కావడంతో డిమాండ్ ఏర్పడింది. రాజకీయ అండదండలు ఉన్న స్థానిక నేతలు మట్టి దందాను ఎంచుకుంటున్నారు.
అక్రమార్కులపై చర్యలు శూన్యం
అవసరాల కోసం మట్టిని తరలించాలంటే రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతి తప్పనిసరి. ఇందుకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ మండలంలో ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చిన మట్టి మాఫియా అనుమతులు లేకుండానే మట్టిని తవ్వేస్తున్నారు. గుట్టలు, చెట్లను తొలగించి ప్రకృతి సంపదను కనుమరుగు చేస్తున్నారు. వీరి ఆగడాలు భరించలేక గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
గుట్టలను కొల్లగొడుతున్న మాఫియా
కనుమరుగవుతున్న ప్రకృతి సంపద
పట్టించుకోని అధికార యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment