జగిత్యాల: మున్సిపాలిటీల్లో మురికినీటి సమస్య వేధిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. కలుషితం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి వ్యవస్థను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో డ్రైనేజీలోని మురికినీటి ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కింద నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో మున్సిపాలిటీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలతోపాటు మురికినీటి శుద్ధి కోసం సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇటీవల టెండర్లు పిలిచినా ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నిర్మాణాలు జరిగేనా..? అనే చర్చ జోరందుకుంది.
చెరువులు కలుషితం
జగిత్యాల మున్సిపాలిటీ చుట్టూ ఐదు చెరువులున్నాయి. మోతె, లింగం చెరువు, కండ్లపల్లి చెరువు, ముప్పాల చెరువు, చింతకుంట చెరువులున్నాయి. జిల్లా కేంద్రం నుంచి వెలువడే మురికినీరంతా డ్రైనేజీల ద్వారా ఈ చెరువుల్లోకి చేరుతోంది. ఫలితంగా చెరువులన్నీ పూర్తిగా కలుషితం అవుతున్నాయి. ఇలాంటి వ్యవస్థకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ 2.0లో భాగంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
స్థలాల ఎంపికే ప్రధాన సమస్య
ఎస్టీపీలను నిర్మించాలంటే స్థలం అధికంగా కావాలి. డ్రైనేజీల నుంచి వెళ్లే మురికినీటినంతా ఒకేచోటకు తీసుకొచ్చేలా ప్రత్యేక పైప్‌లైన్ వేయాలి. డ్రైనేజీలతోపాటు హోటళ్లు, ఇళ్లు, ఎక్కడెక్కడ మురికినీరు ఉంటుందో దానిని మొత్తం ఒకచోటకు చేర్చేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక స్థలం అవసరం ఉంటుంది. ఎంపిక చేసిన స్థలానికి పైప్‌లైన్ల ద్వారా నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాకేంద్రంలో ఐదు చెరువులు ఉండడంతో స్థలాల ఎంపిక ఇబ్బందిగా మారింది. పైగా కాంట్రాక్టర్లు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ నిర్మాణాలు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థలాల ఎంపికతోపాటు, పూర్తిస్థాయిలో బడ్జెట్ వెంటనే వస్తేనే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పబ్లిక్ హెల్త్ అధికారులు టెండర్లు వేసిన ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. ఒకవేళ ఈ నిర్మాణాలు జరిగే మురికినీటి సమస్యతో పాటు, చెరువులు సైతం కలుషితం కాకుండా ఉంటాయి.
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
ముందుకు రాని కాంట్రాక్టర్లు
కలుషితమవుతున్న చెరువులు
Comments
Please login to add a commentAdd a comment