అర్హులందరికీ సంక్షేమ పథకాలు
జగిత్యాలరూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతెలో గురువారం జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికీ వెళ్లి సర్వే చేశామన్నారు. ఎవరైనా అర్హులు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. తహసీల్దార్ రాంమోహన్, ఏఈవో వినీల పాల్గొన్నారు.
కొండముచ్చుల ఫ్లెక్సీతో కోతులకు చెక్
రాయికల్: కొండముచ్చుల ఫ్లెక్సీతో కోతులకు చెక్ పెడుతున్నారు ప్రజలు. రాయికల్ మండలం భూపతిపూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో గురువారం ఆలయ కమిటీ చైర్మన్ సంకోజి మహేశ్ ఇదిగో ఇలా కొండముచ్చుల ఫ్లెక్సీలు తెప్పించారు. వాటిని చూసిన కోతులు ఆలయంలోకి రావడం లేదని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.
యావర్‌రోడ్డు విస్తరణకు రూ.70 కోట్లు కేటాయిస్తాం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల బల్దియాలోని పలు వార్డుల్లో రూ.1.03 కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రెయినేజీలకు గురువారం భూమిపూజ చేశారు. జగిత్యాలకు త్వరలో రూ.100 కోట్లు మంజూరు కానున్నాయని, అందులో రూ.70 కోట్లు యావర్‌రోడ్డుకు కేటాయిస్తామని తెలిపారు. లేఅవుట్లకు అనుగుణంగా ప్రజలు నిర్మాణాలు చేపట్టాలన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు పద్మ, నవీన్, పులి రమణ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
వరద కాల్వకు నీటి నిలిపివేత
జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్సీ నుంచి వరదకాల్వకు గురువారం మధ్యాహ్నం నుంచి సాగునీటిని నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 250, సరస్వతి కెనాల్‌కు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఒడ్డె ఓబన్న విగ్రహం పెట్టండి
జగిత్యాలటౌన్: ఒడ్డెర కులస్తుల ఆత్మగౌరవ ప్రతీక, స్వాతంత్య్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న విగ్రహాన్ని జిల్లాకేంద్రంలోని గోవింద్‌పల్లి కూడలిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరారు. గురువారం కలెక్టర్‌కు లేఖ రాశారు. తొలిదశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికా రికంగా నిర్వహించిందన్నారు. ఈ క్రమంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో మెగా జాబ్‌మేళా
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 28న డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన, డిగ్రీ బీఎస్సీ కోర్సులో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌గా చదివి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు ఉన్న వారిని ఎంపిక చేసుకుంటారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలని, వివరాలకు రాజేశం, రాజేందర్‌రావును సెల్ నంబర్ 99631 17456, 94401 69997లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment