నల్లాలున్నా.. నీరు రాదేమి!
మెట్‌పల్లి: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రా మాలతో పాటు పట్టణాల్లోనూ నీటిని అందించడానికి పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించింది. పనులు పూర్తయి ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందుతోందని ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ఇళ్లకు నీరు సరఫరా కావడం లేదు. మెట్‌పల్లిలో రెండేళ్ల క్రితం నల్లాలు బిగించిన వందలాది ఇళ్లకు ఇప్పటికీ భగీరథ నీరు అందడం లేదు.
రూ.40కోట్లతో పనులు..
● పట్టణంలో 26 వార్డులున్నాయి. భగీరథ పనుల కోసం గత ప్రభుత్వం సుమారు రూ.40కోట్లు మంజూరు చేసింది.
● ఈ నిధులతో పలు చోట్ల స్టోరేజీ ట్యాంకులను నిర్మించారు. అలాగే ఇళ్లకు నీటి సరఫరా కోసం ప్రతివార్డులోనూ పైపులైన్లను ఏర్పాటు చేశారు.
● ఇళ్లకు నల్లాలను బిగించారు.
● ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ నుంచి పైపులైన్ ద్వారా పట్టణంలోని స్టోరేజీ ట్యాంకులకు నీటిని తరలిస్తున్నారు.
● వాటి నుంచి నల్లాల ద్వారా ఇళ్లకు నీటిని సరఫరా చేస్తున్నారు.
● ఇంకా 11వార్డులోని వెంకట్రావ్‌పేట, 12వార్డులోని టీచర్స్ కాలనీ, 7వార్డులోని హన్మాన్‌నగర్, 13వార్డులోని బాలకృష్ణనగర్‌తో పాటు 8, 23వార్డుల్లోని పలు కాలనీలకు భగీరథ నీరు అందడం లేదు.
తాగునీటి కోసం ఇంకా తిప్పలే...
● భగీరథ నీరు అందకపోవడం వల్ల పలు కాలనీ ల ప్రజలకు ఇంకా తాగునీటి కోసం అవస్థలు తప్పడం లేదు.
● వందలాది కుటుంబాలు ఇంకా బోర్లపైనే ఆధారపడి ఉన్నాయి. కొందరు బోరు నీటినే తాగుతుండగా.. మరికొందరు కొనుక్కుంటున్నారు.
● ప్రతినెలా జరుగుతున్న మున్సిపల్ సాధారణ సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు భగీరథ నీటిని అన్ని కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
త్వరలో అందిస్తాం
కొన్ని కాలనీల్లో పైపులైన్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. గత కాంట్రాక్టర్ కొన్నిచోట్ల పనులు పెండింగ్‌లో పెట్టాడు. దీంతో భగీరథ నీటిని అందించలేకపోతున్నాం. పెండింగ్ పనుల పూర్తికి నిధులు మంజూరయ్యాయి. తొందరలోనే పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీరు అందేలా చూస్తాం.
– మోహన్, మున్సిపల్ కమిషనర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న నల్లా పట్టణంలోని వెంకట్రావ్‌పేటలో ఉన్న ఓ ఇంటికి రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ నిధులతో ఏర్పాటు చేసిన ఈ నల్లాకు ఇంతవరకు నీటిని మాత్రం సరఫరా చేయలేదు. తద్వారా ఆ కుటుంబం తాగడానికి నీటిని కొనుక్కుంటోంది. ఇలా ఈ ఒక్కటే కాదు.. చాలా కుటుంబాలు నల్లాల ద్వారా నీరు రాక పోవడంతో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రెండేళ్ల క్రితం ఇళ్లకు నల్లా కనెక్షన్లు
నేటికీ సరఫరా కానీ భగీరథ నీరు
మెట్‌పల్లిలో తాగునీటికి ప్రజల అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment