అనారోగ్యంతో మాజీ జెడ్పీటీసీ మృతి
పెగడపల్లి: పెగడపల్లి మా జీ జెడ్పీటీసీ గజ్జల వసంత (58) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. శనివారం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన పెగడపల్లికి తీసుకొచ్చారు. వసంత 2014లో బీఆర్‌ఎస్ నుంచి పెగడపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): నాలుగు రోజుల క్రితం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మరణించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ఇల్లంతకుంట మండలం వెల్జిపురం గ్రామానికి చెందిన అట్ల నాగభూషణం మండల కేంద్రం నుంచి గ్రామానికి వస్తుండగా.. గూడ సురేశ్ దంపతులు బైక్‌పై రహీంఖాన్‌పేట వద్ద ఎదురెదురుగా వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అట్ల నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వల్లంపట్లకు చెందిన సురేశ్ దంపతులు సిరిసిల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగభూషణం హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
నిధుల అవకతవకలపై విచారణ చేపట్టాలి
మల్లాపూర్: మండలంలోని సిరిపూర్ సహకార సంఘంలో జరిగిన రూ.4కోట్లకు పైగా నిధుల అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని తీర్మానించినట్లు ప్యాక్స్ చైర్మన్ బద్దం అంజిరెడ్డి అన్నారు. సంఘం ఆవరణలో పాలకవర్గ సభ్యులు, రైతులతో మహాజన సభను నిర్వహించారు. సంఘంలో కొంతమంది అక్రమార్కులు గత సీఈవోతో కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. రికవరీపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సహకారశాఖ కమిషనర్‌కి లేఖ రాయనున్నట్లు తెలిపారు. గ్రామశివారులోని సహకార సంఘం పెట్రోల్ బంక్‌ను పునఃప్రారంభించారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ దూలురు సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్లు, సీఈవో పాల్గొన్నారు.
ఓటు ఎంతో విలువైనది
జగిత్యాల: ఓటు ఎంతో విలువైందని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని డీఈవో రాము అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఓటును మించింది లేదని, కచ్చితంగా ఓటు వేస్తాననే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం పలు గ్రామాలు, పట్టణాల్లో ఓటరు చైతన్య ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment