‘భూభారతి’పైనే రైతుల ఆశలు
● పెండింగ్‌లోనే ఉంటున్న భూ సమస్యలు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు ● ఏమీ చెప్పలేకపోతున్న అధికారులు
జగిత్యాల: భూ సమస్యల పరిష్కారానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. పోర్టల్‌లో కొన్ని లోటుపాట్లు ఉండడంతో కొందరు రైతుల భూములకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా మిస్సింగ్ సర్వే నంబర్లు, భూముల హెచ్చుతగ్గులతోపాటు అనేక సమస్యలు చోటుచేసుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి ఎత్తివేసి భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది. కానీ.. అది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో రిజిస్ట్రేషన్లు, ముటేషన్లు, ఇతర లావాదేవీలు ఆలస్యమవుతున్నాయి. రైతులు భూముల క్రయవిక్రయాలు చేయడంతో స్లాట్ బుకింగ్‌లోనూ జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్ గతంలో టెరాసిస్‌కు ఉండగా ప్రస్తుతం నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్‌కి వెళ్లింది. అయినా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ముటేషన్లు, నాలా, జీపీఏ, పీవోబీ, కోర్టుకు సంబంధించిన పాస్‌బుక్, డేటా కరెక్షన్లు అనేకంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. నిత్యం రైతులు కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడంతోపాటు, ప్రజావాణిలో అత్యధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. రైతుల్లో ముఖ్యంగా ఖాతా సర్వేనంబర్ల మిస్సింగ్, పట్టాదారుల పేర్లు తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులతో పాటు, ఇలా ఎన్నో సమస్యలుండగా వాటి పరిష్కారం కోసం ఇప్పటికీ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ప్రభుత్వం కొన్ని మాడ్యుల్స్‌కు అవకాశం ఇవ్వగా రైతులు మీసేవలో ఫీజులు చెల్లిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు సరైన ధ్రువీకరణ పత్రాలు లేవని రిజెక్ట్ చేసిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పెండింగ్‌లోనే..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 2020 అక్టోబర్‌లో ధరణి పోర్టల్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి రైతులు ఏదైనా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్లేది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారు తహసీల్దార్‌కు పంపించేవారు. కానీ సాంకేతిక కారణాలతో చాలా వరకు పెండింగ్‌లోనే ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా భూభారతి పోర్టల్ తీసుకువచ్చినప్పటికీ అది ఇంకా అందుబా టులోకి రాలేదు. రైతుల భూముల సమస్యల పరి ష్కారానికి ధరణి వెబ్‌సైట్ ద్వారా కలెక్టర్లకు విన్నవించేందుకు ధరణి వెబ్‌సైట్ జేఎల్‌ఎం టీమ్ 33 మాడ్యుల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వా రా రైతులు భూ సమస్యల కోసం కలెక్టర్‌కు దరఖా స్తు చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి ధరణిలోని సాంకేతిక సమస్యలను తొలగించి సమస్యలు పరిష్కరించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
కొత్త పోర్టల్ ఎప్పుడో..?
ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతుండగా..కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చి న విషయం తెల్సిందే. ఇది మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోర్టల్ అందుబాటులోకి వస్తే సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక.. పట్టాదారు పాస్‌బుక్‌లు లేక రైతులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
మొత్తం దరఖాస్తులు 1125
తహసీల్దార్ లాగిన్‌లో.. 505
ఆర్డీవో లాగిన్‌లో.. 307
అడిషనల్ కలెక్టర్ లాగిన్‌లో.. 119
కలెక్టర్ లాగిన్‌లో.. 194
త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం
ధరణి దరఖాస్తులు దాదాపుగా పరిష్కారం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయి. భూ భారతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల
‘భూభారతి’పైనే రైతుల ఆశలు
‘భూభారతి’పైనే రైతుల ఆశలు
Comments
Please login to add a commentAdd a comment