అందని అల్పాహారం బిల్లులు
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే చదువుపై ఆసక్తి తగ్గుతుందని, దీనిని అధిగమించేందుకు గత ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పాఠశాల వేళకు ముందే అల్పాహారం అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విస్తరించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. అయితే అమలు చేసిన పాఠశాలల్లో ఏజెన్సీలకు బిల్లులు సకాలంలో అందకపోవడంతో వాటి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పులు తెచ్చి అల్పాహారం అందిస్తే బిల్లులు లేవని వాటితో పాటు వంట చేసిన వేతనాలు కూడా రావడం లేదని నిర్వాహకులు విద్యాశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఏడాది అల్పాహార పథకం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో పథకం అటకెక్కింది. నెలలు గడిచినా అల్పాహార పథకం ఊసే కనిపించడం లేదు.
మండలానికి ఒక పాఠశాల..
సీఎం బ్రేక్‌ఫాస్ట్ట్ పథకాన్ని మొదటి దశ వారీగా ప్రతీ మండలంలో ఒక పాఠశాలలో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో ఉదయం అల్పాహారం అందించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. రానురాను బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పథకం అమలు ఎత్తివేశారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సి బకాయిల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలోని పెద్ద మండలాలు జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం వంటి మండలాల్లో అల్పాహారం అందజేశారు.
రూ.60 లక్షల పెండింగ్ బిల్లులు
జిల్లాలో ఈ పథకం అమలుకు రూ.లక్షల్లో వ్యయం చేయాల్సి ఉంది. ఇప్పటికే పెండింగ్‌లో దాదాపు రూ.60 లక్షలకుపైగా బకాయిలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వారం పాటు ప్రతీరోజూ విద్యార్థులకు ఇవ్వాల్సిన అల్పాహారంలో పొంగలి, కిచిడి, సేమియా, ఉప్మా లేదా రవ్వతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో అల్పాహారం అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. దశల వారీగా ఇడ్లీ, పూరీ, వడ వంటి అల్పాహారాన్ని అందించేందుకు అధికారులు వంట పాత్రలు కూడా సమకూర్చారు. అల్పాహారం సిద్ధం చేసే ఏజెన్సీలకు ప్రత్యేక పారితోషికాన్ని ప్రకటించి, రెండు నెలల పాటు అమలుపర్చారు. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పథకం అమలుకు నోచుకోలేదు. దీంతో బకాయిలు చెల్లింపుపై అధికారుల్లో స్పష్టత కరువైంది.
అప్పు తెచ్చి వంటచేశాం..
గతేడాది అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించాం. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు పెరగడంతో అప్పు తెచ్చి వంట చేశాం. మొదటి రెండు నెలలు బిల్లులు మాత్రమే చెల్లించారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి.
– ఖలీదా బేగం, తాటికొండ ఏజెన్సీ సభ్యురాలు
బిల్లులు విడుదల చేయాలి
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు అల్పాహారం అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
– వేముల నర్సింగం, బీఆర్‌టీయూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలి
గత విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతీ మండలంలో ఒక పాఠశాలలో అల్పాహార పథకం అమలు చేశాం. మొదటి రెండు నెలలు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించినట్లు సమాచారం ఉంది. కొన్ని మండలాల్లో బిల్లుల బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. – రమేశ్, డీఈఓ
అధికారుల చుట్టూ నిర్వాహకుల ప్రదక్షిణలు
బిల్లుల విడుదలపై స్పష్టత కరువు
జిల్లాలో రూ.60లక్షల వరకు పెండింగ్
Comments
Please login to add a commentAdd a comment