ప్రభువు సేవలో తరింపు..
జనగామ: జనగామ ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి లోకరక్షకుడి సేవలో తరిస్తోంది. 124 ఏళ్లుగా క్రీస్తు సేవలో పులకిస్తోంది. 1901లో స్థాపితమైన ఈ చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా ప్రాచుర్యం పొందింది. రష్యాకు చెందిన దంపతులు అన్న ఉన్రు(భార్య), హెర్ని ఉన్రు(భర్త) అనేక దేశాలు పర్యటిస్తూ చివరకు జనగామకు చేరుకున్నారు. 1901 నుంచి వారి సేవలు ఇక్కడ కొనసాగిస్తూ... ప్రెస్టన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి చర్చి సేవలు, ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా (ప్రస్తుతం) మార్చారు. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఉన్రు దంపతులు ప్రెస్టన్ ఇన్‌స్టిట్యూట్ పరిధిలో 63 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ, ఉత్తమ విద్యాబోధనతో అనాథ కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించి అండగా నిలిచారు. ఈ దంపతులకు 8 మంది సంతానం కలగగా, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత చదువులు ఇక్కడే పూర్తి చేశారు. తదనంతరం వారు రష్యా, అమెరికాకు వెళ్లి పోయారు. కాలక్రమేనా 1912లో భర్త హెర్ని ఉన్రు మృతి చెందగా, భార్య అన్న ఉన్రు 1921లో రష్యాలో మృతి చెందారు. ఉన్రు పెద్ద కూతురు తండ్రితోనే జనగామలో ఉంటూ సేవకార్యక్రమంలో పాలొనే వారు. ఆమె కూడా చనిపోవడంతో మృతదేహాన్ని ప్రెస్టన్‌లోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.
2002లో నూతన చర్చి ప్రారంభం..
2000 సంవత్సరంలో చర్చి నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. 2002లో చర్చిని ప్రారంభించారు. 2005లో అప్పటి సీఎం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చిలో విద్యుత్ వెలుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక మంది పా స్టర్లు కరుణామయుడి సన్నిధిలో సేవలందించారు. జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న చర్చిని ‘తల్లి’ చర్చిగా పిలుచుకుంటారు. క్రిస్మస్, గుడ్‌ప్రైడే, న్యూయర్, ఈస్టర్ పండుగల సమయంలో ప్రెస్టన్‌లో చర్చి స్థాపించిన తండ్రి, కూతురు సమాధుల వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
12 దశాబ్దాలుగా క్రీస్తు స్మరణలో
పులకిస్తున్న జనగామ ఉండ్రుపుర చర్చి
రష్యాకు చెందిన దంపతుల
చేతుల మీదుగా స్థాపితం
2005లో మహానేత చేతుల మీదుగా విద్యుత్ వెలుగులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment