![స్థాన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/racha-banda-1_mr-1739131451-0.jpg.webp?itok=UKRHFw1N)
స్థానిక పోరుకు కసరత్తు
జనగామ: పంచాయతీ, జెడ్పీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల మూడవ వారంలో పంచాయతీ లేదా జిల్లా పరిషత్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం నేపధ్యంలో అధికారులు పనులు చక్కబెడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ఆర్‌ఓ (రిటర్నింగ్ ఆఫీసర్స్), ఏఆర్‌ఓ (అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్), స్టేజ్ –2 ఆఫీసర్స్ నియామక ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 280 గ్రామ పంచాయతీలు, 2,534 వార్డులు, 12 జెడ్పీటీసీ, 134 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ ఎలక్షన్ల కోసం 753, పంచాయతీ ఎన్నికల కోసం 2,534 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎలక్షన్ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు.
ఆర్‌ఓ, ఏఆర్‌ఓల నియామకం
పంచాయతీ ఎలక్షన్ నేపధ్యంలో ఎన్నికలకు జిల్లాలో అర్హత కలిగిన ఆయా శాఖల పరిధిలోని 3,618 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలను టీపోల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో 3 వందల మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, స్టేజ్–2 ఆఫీసర్స్‌ను తీసుకోగా, మిగతా వారికి పీఓ (పోలింగ్ ఆఫీసర్), ఓపీఓ, ఇతర కేటగిరీల వారీగా నియామకం చేపట్టనున్నారు. కాగా జీపీ ఎన్నికల కోసం 280 జీపీల పరిధిలో మూడు గ్రామాలను కలిపి 75 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. 75 ఆర్‌ఓ (6 రిజర్వ్‌డ్), 75 ఏఆర్‌ఓ (7 రిజర్వ్‌డ్)లను నియమించారు. వీరికి సపోర్టుగా ప్రతీ జీపీకి ఒకరి చొప్పున 280 మంది స్టేజ్–2 ఆఫీసర్లు పని చేయాల్సి ఉంటుంది. 75 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఎలక్షన్ నిర్వహణకు 12 మంది ఆర్‌ఓ, 12 మంది ఏఆర్‌ఓ, ఎంపీటీసీల కోసం 47 ఆర్‌ఓ, 47 ఏఆర్‌ఓల నియామకం పూర్తైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి 12 ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్లను తీసుకోనున్నారు. ఈ నెల12వ తేదీన ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, ఇతర ఎలక్షన్ అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం పీఓ, ఏపీఓలకు మండలాల వారీగా శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల హడావుడితో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. రిజర్వేషన్ల ఖరారు, ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి.
ఆర్‌ఓ, ఏఆర్‌ఓల నియామకం
12న కలెక్టరేట్‌లో శిక్షణ
![స్థానిక పోరుకు కసరత్తు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09jgn051-330003_mr-1739131451-1.jpg)
స్థానిక పోరుకు కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment