నేటినుంచి లోక్‌సభ నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

నేటినుంచి లోక్‌సభ నామినేషన్ల స్వీకరణ

Published Thu, Apr 18 2024 10:30 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రావీణ్య  - Sakshi

ఖిలా వరంగల్‌: లోక్‌సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. అదేరోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 25వ తేదీ వరకు దాఖలుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను వరంగల్‌ జిల్లా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. సెలవులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్‌ కలెక్టరేట్‌లో, మహబూబాబాద్‌ స్థానానికి సంబంధించి మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు నిబంధనలు..

● ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దా ఖలు చేయొచ్చు.

● అభ్యర్థి వెంట నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.

● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

● రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులకు 10మంది ఓటర్లు ప్రతిపాదించాలి.

● పోటీ చేసే అభ్యర్థులు వేరే లోక్‌సభ సెగ్మెంట్‌కు చెందిన వారైతే తప్పసరి వారి అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్‌ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

● అభ్యర్థులు గరిష్టంగా రూ.95లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు.

● సంబంధిత బ్యాంకు ఖాతా లావాదేవీల ఆధారంగానే అభ్యర్థులు వ్యయాన్ని లెక్కిస్తారు.

● నామినేషన్‌ పత్రంలోని పార్ట్‌–3ఏ లో క్రిమినల్‌ కేసుల వివరాలు పొందుపర్చాలి.

● ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే అనుమతి పొందాలి.

● కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల విషయంలో సెక్షన్‌ 127–ఏ సూచనలు పాటించాలి.

● ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సమన్వయంతో పనిచేయాలి

– ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రావీణ్య

పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల నోడల్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్‌ నుంచి పార్లమెంట్‌ నియోజక పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలోని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, జిల్లా నోడల్‌ అధికారులతో వీ డియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై సమీ క్ష నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేసే అభ్యర్థుల వాహనాల అనుమతులకు సువిధ ద్వారా రిటర్నింగ్‌ అధికారి పరిధిలో మంజూరు చేయాలని, సభలు, సమావేశాలకు సంబంధిత అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు లేదా ఎన్నికల అధికారుల స్థాయిలో మంజూరు చేయాలన్నారు. ఎస్‌ఎస్‌టీలు గురువారం ఉదయం నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు సకాలంలో రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారం 12 స్వీకరణ, అత్యవసర సర్వీసెస్‌, వృద్ధులు, దివ్యాంగుల హోం ఓటింగ్‌ ఈ నెల 25లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో వీల్‌ చైర్లతోపాటు వలంటీర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

పొరపాట్లు జరగొద్దు..

నామినేషన్లు స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మాక్‌ (ట్రయల్‌) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓలు శ్రీనివాస్‌, వైవీ గణేష్‌, డీఎస్‌ వెంకన్న, రోహిత్‌ సింగ్‌, నారాయణ, వెంకటేష్‌, సీదం దత్తు, మంగీలాల్‌, జిల్లా నోడల్‌ అధికారులు రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: వరంగల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి,

కలెక్టర్‌ ప్రావీణ్య

అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

సభలు, వాహనాల ప్రచారం

అనుమతులతోపాటు

పలు అంశాలపై సమీక్ష

Advertisement
Advertisement