సిర్రగోనె ఆడిన.. ఈతకు వెళ్లిన
జనగామ: చిన్ననాటి జ్ఞాపకాల అనుభూతి మరువలేనిది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇంట్లో ఉంటే అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు. బయటకు వెళ్తే స్నేహితులు. వారితో కలిసి ఆటలు ఆడుకునే వాళ్లం. స్కూల్‌కు సెలవొస్తే సిర్రగోనె, లింగోచ్ ఆడిన తర్వాత ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లేవాడిని. స్కూల్‌లో పోటీలు పెడితే ఆ రోజంతా పండగలా అనిపించేది. సాయంత్రం 6 గంటల వరకు టీవీ చూడనిచ్చేవారు కాదు. నవోదయ గురుకులానికి వెళ్లిన తర్వాత వారానికి రెండు సార్లు తెలుగు సినిమాలు చూపించేవారు. ఇప్పటి పిల్లలు క్రమశిక్షణతో కూడిన ఎంజాయ్ చేస్తూనే.. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.
– రాజమహేంద్ర నాయక్, డీసీపీ, జనగామ
●
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశా..
ఆంధ్రలోని ఒంగోలులోనే పాఠశాల చదువులు పూర్తి చేసుకున్నా. ఉమ్మడి కుటుంబం కావడంతో ఎక్కువగా ఇంట్లో గడిపేటోళ్లం. ఇంటి పక్కనే స్కూల్ కావడంతో ఒకరోజు కూడా సమయం తప్పలేదు. సాయంత్రం ఇంటికి రాగానే గంటసేపు ట్యూషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత, బుక్స్ పక్కన పడేసి, రాత్రి వరకు ఫ్రెండ్స్‌తో క్రికెట్, అనేక రకాల ఆటలతో ఎంజాయ్ చేశా. రోజులో టీవీ గంట సేపు కూడా చూసేటోళ్లం కాదు. బాలల దినోత్సవం రోజు బడిలో పోటీలు నిర్వహించి, బహుమతులు వస్తే ఆ రోజంతా సంతోషమే. నేటితరం యువత, పిల్లలు కష్టపడి చదువుకుని, తల్లిందండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి.
– షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్, జనగామ
●
Comments
Please login to add a commentAdd a comment